Begin typing your search above and press return to search.

ప‌దునెక్కుతున్న మాట‌ల ‘ఈటెలు’..!

By:  Tupaki Desk   |   3 April 2021 6:30 AM GMT
ప‌దునెక్కుతున్న మాట‌ల ‘ఈటెలు’..!
X
తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్వరం మారుతోందని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది అధిష్టానంపై చూపిస్తున్న అసంతృప్తేనా? అనే చ‌ర్చ‌కూడా సాగుతోంది. కొంత‌కాలంగా ఉద్య‌మాల గురించి, ప్ర‌భుత్వాల జ‌వాబుదారీ త‌నం గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న మంత్రి ఈటెల‌.. తాజా స‌మావేశంలోనూ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. వాటి తీవ్ర‌త కూడా పెంచారు. దీంతో.. ఈటెల వ్య‌వ‌హార‌శైలి మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

శుక్ర‌వారం హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన ఓ స‌మావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. భార‌త రాజ్యాంగంపై పాల‌కులు ప్ర‌మాణం చేస్తున్న‌ప్ప‌టికీ.. వారి ప్ర‌మాణాల‌ను స‌రిగా నిల‌బెట్టుకోవ‌ట్లేద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. పాలన చేప‌ట్టేవారికి కూడా మెరిట్ ఉండాల‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

విద్యార్థులెవ‌రికీ మెరిట్ లేకుండా సీటు రాద‌ని, ఇదే త‌ర‌హాలో పాల‌కుల‌కు కూడా మెరిట్ ఉండాల‌ని ఈటెల అన్న‌ట్టు స‌మాచారం. భార‌త రాజ్యాంగంపై వారికి ఉన్న అవ‌గాహ‌న ద్వారా మెరిట్ ను అంచ‌నా వేయాల‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, దేశంలో పెరిగిపోతున్న పేద‌రికం, ప్ర‌భుత్వాల వ్య‌వ‌హార‌శైలిపై ఘాటైన కామెంట్లు చేసిన‌ట్టు స‌మాచారం. సంప‌ద కొద్దిమంది చేతిలో కేంద్రీకృత‌మైతే దేశానికి ఏ మాత్రం మంచిది కాద‌ని ఈటెల అన్నార‌ట‌. అంబానీ లాంటి వ్య‌క్తి ధ‌న‌వంతుడైతే.. భార‌త్ ధ‌నిక దేశం కాద‌ని, ఇది దేశంలోని పేద‌రికాన్ని దాచిపెట్ట‌లేద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా.. ప్ర‌జాసంక్షేమంపై ప్ర‌భుత్వాలు నిజాయితీగా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్న‌ట్టు స‌మాచారం. ఇవాళ ఢిల్లీలో రైతులు ఆందోళ‌న చేస్తున్నార‌ని, అది రేపు మ‌న వ‌ద్ద‌కు కూడా రావొచ్చ‌ని, అందువ‌ల్ల ముందే మేల్కోవాల్సి ఉంద‌ని చెప్పార‌ట ఈటెల‌. అంతేకాదు.. సంక్షేమం కోసం ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తే.. దానికి మ‌ద్ద‌తు తెల‌పాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వాలు ఎన్నటికీ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని కూడా వ్యాఖ్యానించిన‌ట్టు తెలుస్తోంది.

మొత్తంగా.. ఈటెల మాట‌ల్లో క‌ర‌కుద‌నం రోజురోజుకూ పెరుగుతోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి, ఇది ఎవ‌రిపై యుద్ధం? ఎంత వ‌ర‌కూ వెళ్తుందో చూడాలి.