Begin typing your search above and press return to search.

హరీశ్.. కవితలను ఈటల టార్గెట్ చేయటం వెనుక వ్యూహం అదేనా?

By:  Tupaki Desk   |   6 Jun 2021 2:30 PM GMT
హరీశ్.. కవితలను ఈటల టార్గెట్ చేయటం వెనుక వ్యూహం అదేనా?
X
రాజకీయాల్లో ఏది ఉత్తినే జరగదు. చీమ చిటుక్కుమన్నా.. దానికి కారణం మరేదో అయి ఉంటుంది. కొన్ని ఉదంతాలు చోటు చేసుకున్న వెంటనే కనెక్టు అవుతాయి. మరికొన్ని ఎప్పటికి అర్థం కాని శేష ప్రశ్నలుగా మిగిలిపోతాయి. తాజాగా ఈటల ఎపిసోడ్ విషయాన్నే తీసుకోండి.. అసలు ఆయనకు.. కేసీఆర్ కు ఎక్కడ చెడింది? ఈటల లాంటి నేతపై భూకబ్జా మరక వేయాలన్న బలమైన నిర్ణయాన్ని కేసీఆర్ ఎందుకు తీసుకున్నట్లు? అన్నది అసలు ప్రశ్న. అంతేకాదు.. ఏ లెక్కలు తేడా వచ్చి.. ఈటలపై పెద్ద సారు అంతటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నది మరో సందేహం.

ఇవన్నీ ఇలా ఉండగానే.. బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈటల.. రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఎదురైన చిక్కుముడులు.. సమస్యలకు కారణం సీఎం కేసీఆర్. ఆ మాటకు వస్తే.. ఈటల టార్గెట్ మొత్తం గులాబీ బాస్ మీదనే ఉండాలే కానీ.. అందుకు భిన్నంగా హరీశ్ ప్రస్తావన.. కసీఆర్ కుమార్తె కవిత మీద ఫోకస్ పెట్టటం ఆసక్తికరంగా మారింది. తనకు మాదిరే ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికి మంత్రి హరీశ్ మౌనంగా ఉన్నట్లుగా ఆరోపించారు.

దీనిపై హరీశ్ స్పందిస్తూ.. ఈటల వ్యాఖ్యల్ని ఖండించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ కుమార్తెను ఈటల టార్గెట్ చేయటం.. ఆమెపై విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనమైంది. మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు పెద్ద సారు ప్రయత్నిస్తే.. అందుకు ఈటల అడ్డుపడ్డారని.. తమ లాంటి సీనియర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న సంకేతాల్ని పంపారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కేసీఆర్ - ఈటల మధ్య గ్యాప్ పెరగటానికి మంత్రి కేటీఆర్ కారణం అనుకుందాం. అలాంటప్పుడు రామ్ మీద అంతో ఇంతో విరుచుకుపడాలి.

కానీ.. కేటీఆర్ ప్రస్తావనను తీసుకురాని ఈటల.. అనూహ్యంగా కుమార్తె కవితను.. ఆమె జోక్యాన్ని.. వివిధ సంఘాల్లో ఆమె చక్రం తిప్పటాన్ని ప్రశ్నించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు. ఈటల వ్యాఖ్యల్ని వూహాత్మకంగా సాగినట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ ను విమర్శిస్తే.. అది పాత పంచాయితీ ఖాతాలోకి వెళుతుందని.. కవితను ఒక మాట అనేందుకు ఎవరూ సాహసం చేయలేని వేళ.. తాను మాట్లాడితే అది చర్చనీయాంశంగా మారి.. కేసీఆర్ డిఫెన్సులో పడతారన్న ఉద్దేశంతోనే ఈటల అలా చేసి ఉంటారని చెబుతున్నారు.

మంత్రి హరీశ్ విషయానికి వస్తే.. ఇప్పటికే ప్రజల్లో ఉన్న చర్చకు.. తాను కూడా వంత పాడటం ద్వారా.. ప్రజల్లో మరోసారి దాన్నో చర్చగా చేయటం.. తాను చెప్పేవన్ని నిజాలన్న భావన ప్రజల్లో కలిగేందుకే ఆయనీ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. కేసీఆర్ వద్ద దశాబ్దాల తరబడి నలిగిన ఈటలకు.. ఎప్పుడేం చేస్తే.. ప్రత్యర్థుల్ని ఇరుకున పడేయొచ్చన్న విషయంపై అవగాహన ఉంటుంది. అందులో భాగంగానే ఆయనీ విమర్శల పర్వానికి తెర తీశారన్న మాట వినిపిస్తోంది.