Begin typing your search above and press return to search.

పొంగులేటి.. జూపల్లి.. బీజేపీలో చేరరు అంతే

By:  Tupaki Desk   |   30 May 2023 7:00 AM GMT
పొంగులేటి.. జూపల్లి.. బీజేపీలో చేరరు అంతే
X
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి పొంగులేటి దారెటు.. జూపల్లి పయనం ఎటూ అని.. వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారన్నదే హాట్ టాపిక్. వారి కోసం కాంగ్రెస్, బీజేపీ, షర్మిల సహా అందరూ కళ్లు కాయలు కాసి పుచ్చిపోయేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఇద్దరూ ఎందులోనూ చేరడం లేదు. చేరమని చెప్పడం లేదు. ఈ పితలాటకం కొనసాగుతున్న వేళ బీజేపీలో చేరరన్న విషయం మాత్రం తాజాగా కన్ఫమ్ అయ్యింది.

భారత్‌ రాష్ట్ర సమితి బహిష్కరించిన నేతలు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బిజెపి చేరిక విషయమై ఆ పార్టీ నేత, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బిజెపిలో చేరడం కష్టమేనని అన్నారు. 'ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు' అని ఈటల వ్యాఖ్యానించారు. వారు కాంగ్రెస్‌లోకి వెళుతూ తనను కూడా రావాలని సూచించినట్లు ఈటల వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ బహిష్కరించిన నేతలు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎంతో కీలకంగా మారారు. బిఆర్‌ఎస్‌కు దూరమైన ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరితో ఆ పార్టీ బలపడుతుందనేది రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిని బిజెపిలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఎన్నోసార్లు వారితో రహస్యంగా, బహిరంగంగా సమావేశమయ్యారు. అయితే ఆయన ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి.

ఈ విషయాన్ని స్వయంగా ఈటల రాజేందర్‌ వెళ్లడించడం గమనార్హం. హైదరాబాద్‌లోని ఓ హోటళ్లో మీడియాతో మాట్లాడిన రాజేందర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రోజూ జూపల్లి, పొంగులేటితో రోజూ మాట్లాదుతున్నానని తెలిపారు. ఇప్పటిదాకా వారిని కాంగ్రెస్‌లో చేరకుండా ఆపగలిగానని అన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ బలంగా ఉందని, బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. బిజెపిలో చేరిక విషయంలో వారే తనకు రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చారని చెప్పారు.

టిఆర్‌ఎస్‌ పార్టీలో గొప్ప నాయకునిగా ఉన్న ఈటల రాజేందర్‌ ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిజెపిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజాబలం ఉన్న ఆయన జూపల్లిని, పొంగులేటిని బిజెపిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈటెల ప్రయత్నాలు ఫలించకపోగా వాళ్లు కాంగ్రెస్‌ గూటిలో చేరుతున్నారని, ఈటెలను కూడా రావాల్సిందిగా కోరుతున్నట్లుగా తెలుస్తోంది. తనకే రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

ఈటలనే తమతో కలిసి రావాల్సిందిగా కోరిన జూపల్లి, పొంగులేటి తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్‌ 2న కాంగ్రెస్‌ లో చేరాలనుకున్నారు. అయితే శుభముహూర్తం కారణంగా జూన్‌ 8న చేరుతున్నట్లు తెలిసింది. రాహూల్‌ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.