Begin typing your search above and press return to search.

మంత్రి హ‌రీశ్‌కు ఈట‌ల స‌వాల్‌.. చ‌ర్చ‌కు ర‌మ్మ‌ని పిలుపు

By:  Tupaki Desk   |   8 March 2022 9:02 PM IST
మంత్రి హ‌రీశ్‌కు ఈట‌ల స‌వాల్‌.. చ‌ర్చ‌కు ర‌మ్మ‌ని పిలుపు
X
మంత్రి హరీశ్‌రావుకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. బడ్జెట్‌పై తనతో చర్చకు రావాలని‌ పిలుపు‌నిచ్చారు. బడ్జెట్‌లో లొసుగులు బయటపెడతానన్న భయంతోనే అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఈటల వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రంపై విమర్శలు చేయడాన్ని హరీశ్‌రావు విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికమంత్రి హరీశ్‌కు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు.

``శాసనసభ్యుల హక్కులను ముఖ్యమంత్రి కాలరాశారు. మా సీట్లలో మేము నిలబడి నిరసన తెలుపుతుంటే ఎలా సస్పెండ్ చేస్తారు?. సభ్యుల‌ హక్కులను హరిస్తే స్పీకర్ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించటం బాధాకరం. ఎఫ్‌ఆర్‌బీఎమ్ చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటోంది.
రాష్ట్రాలు 3 నుంచి 5 శాతం అధిక రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. నీతి ఆయోగ్ నిధులు ఇవ్వలేమని కేంద్రం చెప్పినా..‌ రాష్ట్ర బడ్జెట్‌లో ఎలా చూపిస్తారు?. భూముల అమ్మకాల ద్వారా 15వేల కోట్లు ఆదాయం వస్తోందనటం చేతకాని తనమే.`` అని అన్నారు.

అంతేకాదు.. క‌నీసం 40 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను ఐదారు రోజులకు పరిమితం చేయటం దుర్మార్గం కాదా అని ప్ర‌శ్నించారు. ``దళితబంధు ఒక బోగస్. దళితబంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం‌ ఒక్కటీ లేదు. లిక్కర్ ఆదాయం మీదనే ప్రభుత్వాన్ని నడపటం సిగ్గు చేటు. రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ కు బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు.'' అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఇక‌, ఈ విమ‌ర్శ‌ల‌పై హ‌రీశ్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. బీజేపీ సభ్యులు రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. బ‌డ్జెట్‌ సెషన్ పూర్తయ్యే వరకు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీక‌ర్ వెల్లడించారు. సభ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.

ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. అసెంబ్లీ ఆవరణలో నిరసనకు దిగారు. చివరకు ముందుగా రాజాసింగ్, రఘునందన్ రావును మార్షల్స్ బయటకు తరలించారు. ఆ తరువాత ఈటలను కూడా బయటకు తరలించారు. ఈ నేప‌థ్యంలో ఈట‌ల వ్యాఖ్య‌లు, స‌వాళ్లు ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం.