Begin typing your search above and press return to search.

ఈటెల సాబ్.. వైద్యుల్ని అడిగే ఈ సూచన చేశారా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 4:30 PM GMT
ఈటెల సాబ్.. వైద్యుల్ని అడిగే ఈ సూచన చేశారా?
X
అదిరే స్టేట్ మెంట్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు లేదన్న ప్రాథమిక సత్యాన్ని మరోసారి గుర్తు చేసిన ఆయన.. ధైర్యమే మందుగా పేర్కొన్నారు. కరోనాను ధైర్యంతోనే ఎదుర్కోవాలని.. అదే సరైన మందుగా పేర్కొన్నారు. కరోనా బాధితులకు మనోధైర్యం కల్పించేలా నడుచుకోవాలని విన్నవించిన ఆయన.. ధైర్యంగా ఉండాలన్నారు.

అమెరికా లాంటి దేశం కరోనాతో విలవిలలాడుతుంటే.. మనం మాత్రం సమన్వయంతో ఎదుర్కొన్నట్లు చెప్పిన ఆయన.. కొంత తత్త్వ బోధన చేశారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయని.. మనిషి మాత్రం ప్రకృతిని శాసించే ప్రయత్నం చేస్తుంటారన్నారు. ఒకరికొకరు సాయంగా ఉండాలని కరోనా గుర్తు చేసిందన్న ఈటెల.. వైద్యులు ఎంతో సాహసంతో వైద్య సిబ్బంది రోగులకు తోడుగా నిలవటాన్ని ప్రశంసించారు.

కరోనాకు భయపడి ఇతర రోగాలకు చికిత్స చేయించుకోకపోవటం సరైనది కాదన్న ఆయన.. క్యాన్సర్.. మూత్రపిండాలు.. ఇతర వ్యాధులతో బాధ పడేవాళ్లు అందుకు తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. లేదంటే.. ఆయా వ్యాధులతో మరణించే ప్రమాదం ఉంటుందన్నారు. ఫ్లాస్మా థెరపీ ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చిందని.. మరెంతో మంది ప్రాణాల్ని నిలబెట్టిందన్నారు.

ఈటెల వారు చెప్పిన మాటలన్ని బాగానే ఉన్నాయి కానీ.. ఎంతో అవసరమైతే తప్పించి ఆసుపత్రికి రావొద్దని చెబుతుంటే.. అందుకు భిన్నంగా ఆసుపత్రులకు వెళ్లాలని చెప్పేలా ఈటెల వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కాస్త అటు ఇటుగా నమోదవుతున్న వేళ.. ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చే ముందు వైద్యులతో మాట్లాడి.. వారి చేత చెప్పిస్తే బాగుంటుందేమో ఈటెల సాబ్?