Begin typing your search above and press return to search.

భూ క‌బ్జా నిజ‌మే..! ఈటెల కింక‌ర్త‌వ్యం ఏమిటీ..?

By:  Tupaki Desk   |   7 Dec 2021 12:10 PM IST
భూ క‌బ్జా నిజ‌మే..! ఈటెల కింక‌ర్త‌వ్యం ఏమిటీ..?
X
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. అసైన్డ్ భూముల‌ను క‌బ్జా చేసింది నిజ‌మేన‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. ఈటెల స‌తీమ‌ణి పేరుతో ఉన్న జ‌మునా హేచ‌రీస్ కంపెనీ ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని.. అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేప‌ట్టింద‌ని మీడియా స‌మావేశంలో మెద‌క్ క‌లెక్ట‌ర్ హ‌రీశ్‌ వెల్ల‌డించారు.

ఈటెల రాజేంద‌ర్ భూక‌బ్జా నిర్ధార‌ణ అయింది. స‌ర్వే త‌ర్వాత క‌బ్జా వ్య‌వ‌హారం తేలింది. ఈ వివ‌రాల‌ను మెద‌క్ క‌లెక్ట‌ర్ మీడియా స‌మావేశంలో సోమ‌వారం వెల్ల‌డించారు. అచ్చంపేట, హకీంపేట పరిధిలో 70 ఎక‌రాల 30 గుంట‌ల భూమిని ఈటెల అండ్ కంపెనీ క‌బ్జా చేసింది.

క‌బ్జా అయిన భూముల్లో అసైన్డ్ సీలింగ్ భూములు ఉన్న‌ట్లు తెలిసింది. 56 మంది భూముల‌ను ఆక్ర‌మించుకున్న‌ట్లుగా తేలింది. అచ్చంపేట గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్ 81లో 5 ఎక‌రాలు క‌బ్జా చేశారని క‌లెక్ట‌ర్ తెలిపారు.

స‌ర్వే నంబ‌ర్ 130లో 3 ఎక‌రాలు అసైన్డ్ భూమి అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్ అయింది. నిషేధిత జాబితాలో ఉన్న 8 ఎక‌రాల‌ను ప్ర‌భావితం చేసి రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. 130 స‌ర్వేలో ఎలాంటి అనుమ‌తులు లేకుండానే అసైన్డ్‌ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు క‌ట్టారు.. అని ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ నిర్మాణాల‌న్నింటికీ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అనుమ‌తి కూడా తీసుకోలేదు. ఎల్క‌చెరువు, హ‌ల్దీ చెరువులోకి ఫౌల్ట్రీ వ్య‌ర్థాల‌ను వ‌దులుతున్న‌ట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు.

దీంతో జ‌మున హేచ‌రీస్‌పై కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి నివేదిక ఇచ్చింది. అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపై, స‌హ‌క‌రించిన అధికారుల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోబోతున్నామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. బాధితులకు త‌గిన న్యాయం చేస్తామ‌ని.. వారికి తిరిగి భూములు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌రీశ్ వివ‌రించారు.

ఈ వ్య‌వ‌హారాల‌న్నింటిపై ప్ర‌భుత్వానికి స‌మ‌గ్ర నివేదిక అందజేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పుడు ఈటెల రాజేంద‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడోన‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

భూ కుంభ‌కోణం నుంచి సచ్చీలుగా బ‌య‌ట‌ప‌డ‌తాడా..? ప్ర‌భుత్వం నివేదిక‌ను ప‌రిశీలించి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంది..? ఈ అంశాన్ని ఈటెల ఎలా ఎదుర్కొంటారు..? రాజ‌కీయ కోణంలో ప్ర‌భుత్వంపై యుద్ధం చేస్తారా..? బీజేపీ ఈ వ్య‌వ‌హారాన్ని ఎలా చూస్తుంది..? లాంటి సందేహాలకు త్వ‌ర‌లో స‌మాధానాలు తెలిసే అవ‌కాశం ఉంది.