Begin typing your search above and press return to search.

అరే.. గ‌వ‌ర్న‌ర్ సాబ్ మీద ఆ మాట‌లేంది భ‌య్?

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:13 AM GMT
అరే.. గ‌వ‌ర్న‌ర్ సాబ్ మీద ఆ మాట‌లేంది భ‌య్?
X
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తి ఎవ‌ర‌న్న వెంట‌నే.. ఒక‌రు కాదు ఇద్ద‌రంటూ ఇద్ద‌రు చంద్రుళ్ల పేరు చెబుతుంటారు. వాస్త‌వానికి అది చాలా పెద్ద త‌ప్పు. ఇద్ద‌రు చంద్రుళ్ల కంటే కూడా సూప‌ర్ ప‌వ‌ర్ ఒక‌టి తెలుగు నేల మీద ఉంది. ఆ ప‌వ‌ర్ మ‌రెవ‌రో కాదు.. రెండు రాష్ట్రాలకు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్‌.

యూపీఏ స‌ర్కారు ఏరికోరి నియ‌మించిన ఒక గ‌వ‌ర్న‌ర్ ను మోడీ స‌ర్కారు కంటిన్యూ చేయ‌టం..ఆయ‌న‌కు మ‌రో ట‌ర్మ్ అవ‌కాశం ఇవ్వ‌టం మామూలు విష‌యం కాదు. కేవ‌లం న‌ర‌సింహ‌న్ కు మాత్ర‌మే ద‌క్కిన గుర్తింపుగా చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న మీద పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఎప్పుడూ వ‌మ్ము చేయ‌ని గ‌వ‌ర్న‌ర్ సాబ్ ప‌ద‌వీ కాలం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది.

మ‌రో ట‌ర్మ్ ఆయ‌న‌కు అవ‌కాశాన్ని ఇస్తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేకున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు మాత్రం న‌ర‌సింహ‌న్ సాబ్ అంటే అదోలాంటి మ‌ర్యాద‌.. గౌర‌వం.. భ‌క్తి కూడా. సాటి మంత్రివ‌ర్గ స‌భ్యుల‌కు కూడా చెప్ప‌ని ఎన్నో విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు షేర్ చేసుకుంటార‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది.

అంత ద‌గ్గ‌రిత‌నం ఉన్న గ‌వ‌ర్న‌ర్ ట‌ర్మ్ పూర్తి అవుతున్న వేళ‌.. ఢిల్లీ స్థాయిలో పావులు క‌ద‌ప‌కుండా ఉంటారా? ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ మీద కోపం ఉన్నోళ్లంతా గ‌వ‌ర్న‌ర్ ను టార్గెట్ చేసుకొని విమ‌ర్శ‌లు చేయ‌టం ఇప్పుడు అల‌వాటుగా మారింది. కేసీఆర్ మీద నిప్పులు చెరిగినా.. మీడియాలో ఇచ్చే ప్రాధాన్య‌త తెలిసిందే కావ‌టంతో..నేత‌లు కాస్త రూటు మార్చి గ‌వ‌ర్న‌ర్ సాబ్ పై విరుచుకుప‌డుతున్నారు.

తాజాగా అలాంటి ప‌నే చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయ‌ణ‌రెడ్డి. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న స్పీచ్ చూస్తే.. రిటైర్మెంట్ అయ్యాక టీఆర్ ఎస్ లో చేరేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌న్నారు.

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం మంచి ప‌నులు చేస్తే పొగ‌డొచ్చ‌ని.. కానీ గ‌వ‌ర్న‌ర్ తీరు చూస్తే మాత్రం ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను.. ఆయ‌న పార్టీని పొగిడేందుకే ఎక్కువ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లుగా మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ప‌ర‌మ చెత్త‌గా ఉంద‌న్న ఆయ‌న‌.. జూన్ లో ముగిసే ప‌ద‌వీ కాలాన్ని మ‌రికొంత కాలానికి పొడిగించుకోవ‌టానికి వీలుగా ఆయ‌న మాట‌లు ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. చూస్తుంటే గ‌వ‌ర్న‌ర్ సాబ్ మీద గూడూరు నారాయ‌ణ‌రెడ్డి మ‌స్తు నారాజ్ లో ఉన్న‌ట్లు క‌నిపించ‌ట్లేదు!