Begin typing your search above and press return to search.

రైతు రాజ్యంలో ఏరువాక ఏమైంది? : జ‌గ‌న్‌కు టీడీపీ నేత‌ల సూటి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   5 Jun 2023 6:55 PM IST
రైతు రాజ్యంలో ఏరువాక ఏమైంది? :  జ‌గ‌న్‌కు టీడీపీ నేత‌ల సూటి ప్ర‌శ్న‌
X
త‌న‌ది రైతు రాజ్య‌మ‌ని, రైతుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని పదే ప‌దే చెప్పుకొనే సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఏరువాక పౌర్ణమి నాడు రైతుల‌కు ఏం చేశార‌ని టీడీపీ నేత‌లు సూటిగా ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏరువాక పౌర్ణ‌మి వ‌స్తే.. రైతుల‌ను ప్రోత్స‌హించిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావించారు. త‌మ హ‌యాంలో ఏటా ఏరువాక పౌర్ణ‌మి నాడు రైతులు బాగుండాల‌ని, పంట‌లు బాగా పండాల‌ని కోరుతూ.. స్వ‌యంగా చంద్ర‌బాబు పొలాల్లోకి వెళ్లి అర‌క దున్నిన విష‌యాన్ని వారు వివ‌రించారు. అయితే.. తాజాగా ఆదివారం ఏరువాక పౌర్ణ‌మి వ‌చ్చినా.. సీఎం జ‌గ‌న్ కానీ, ఆయ‌న మంత్రి వ‌ర్గం కానీ ఎక్కడా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌లేద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

అస‌లేంటీ ఏరువాక‌?

ఆదివారం ఏరువాక పౌర్ణ‌మి. పౌర్ణ‌మి సాధార‌ణంగా ప్ర‌తి నెలా రెండు సార్లు వ‌స్తుంది. అయితే, ఏడాదికి ఒక్కసారి వ‌చ్చే ఏరువాక పౌర్ణ‌మికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. దీనికి రైతుల‌కు పేగు బంధం వంటి అవినాభావ సంబంధం ఉంది. ఏరువాక పౌర్ణ‌మికి ఖ‌రీఫ్ సాగును ప్రారంభిస్తారు. దీనిని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించిన గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏరు వాక పౌర్ణ‌మిని ఘ‌నంగా నిర్వ‌హించేది. ఇదే విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు ప్ర‌స్తావిస్తూ.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇప్పుడు రైతు రాజ్య‌మ‌ని చెప్పుకొంటున్న వైసీపీ ప్ర‌భుత్వం ఏరువాక పౌర్ణ‌మి వ‌స్తే.. ఎక్క‌డా చ‌డీ చ‌ప్పుడు లేకుండా మిన్న‌కుంద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రైతు రాజ్య‌మ‌ని, రాజన్న రాజ్య‌మ‌ని చెప్పుకొనే జ‌గ‌న్‌.. తాడేప‌ల్లికే ప‌రిమితం అయ్యారని అంటున్నారు. అంతేకాదు, నాడు చంద్ర‌బాబు రైతులు, పంట‌లు, ప్ర‌జ‌లు బాగుండాల‌ని ఏరువాక పౌర్ణ‌మికి ప్రాధాన్యం ఇస్తే.. ఇదే రోజు జ‌గ‌న్ తాడేప‌ల్లిలో త‌న శాంతి కోసం.. త‌న ర‌క్ష‌ణ కోసం.. త‌న పాల‌న మ‌ళ్లీ మ‌ళ్లీ రావాల‌నే ఉద్దేశంతో శాంతి య‌జ్ఞం చేసుకున్నారని దుయ్య‌బ‌డుతున్నారు.