Begin typing your search above and press return to search.

గవర్నర్ సాబ్ పెద్ద తప్పే చేశారా?

By:  Tupaki Desk   |   24 Sept 2015 12:10 PM IST
గవర్నర్ సాబ్ పెద్ద తప్పే చేశారా?
X
అత్యున్నత స్థానాల్లో ఉండే వారి ఇబ్బందులు భారీగానే ఉంటాయి. తొందరపడి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నాలేనిపోని తలనొప్పులు ఖాయం. అధికార.. విపక్షాలకు అనుసంధానంగా ఉంటూ.. విమర్శలకు.. ఆరోపణలకు అతీతంగా గవర్నర్ స్థానంలో ఉన్న వారు వ్యవహరించాల్సి ఉంది. ఆ విషయంలో ఏ చిన్నపాటి పొరపాటు దొర్లినా విమర్శలు మూటగట్టుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు.

ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లోనూ ఆరోపణలు ఎదుర్కొన్న గవర్నర్ నరసింహన్ పై తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. ఆయన వైఖరిని ప్రశ్నించటమే కాదు.. కొన్ని అంశాలపై విపరీతంగా తప్పు పట్టారు కూడా.

తెలంగాణ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం పథకంపై ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఎన్ని ఇళ్లు కట్టించారో చూడకుండా ఎలా మెచ్చుకుంటారని ప్రశ్నిస్తున్న ఎర్రబెల్లి.. గవర్నర్ అధికారపార్టీకి ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పొగిడేస్తున్న గవర్నర్.. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు పరామర్శించటం లేదని విమర్శించారు. టీడీపీ నుంచి అక్రమంగా ఫిరాయింపులకు పాల్పడ్డ మంత్రిపదవి పొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకుండా.. ఆయన్ను వెంట పెట్టుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఏ విధంగా తనిఖీ చేస్తారని ప్రశ్నించారు.

ఎర్రబెల్లి విమర్శల్ని చూస్తే.. కొన్ని సమంజసంగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంపై ప్రశంసలు కురిపించిన ఆయన.. రైతుల ఆత్మహత్యలపై పెదవి విరిస్తే బాగుండేదన్న వాదన ఉంది. ఒకవేళ అది ప్రాక్టికల్ గా ఇబ్బంది అయితే.. కనీసం పరోక్షంగా అయినా ఆ విషయాల్ని ప్రస్తావించటం ద్వారా.. మంచికి.. చెడుకూ రెండింటికి తాను రియాక్ట్ అవుతానన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు అయ్యేది.

దీంతో పాటు.. వివాదాస్ప అంశాల్లో పాత్రధారులుగా ఉన్న మంత్రి తలసాని లాంటి వారి విషయంలో గవర్నర్ దూరంగా ఉండే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మంత్రి తలసాని అనర్హతపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయనతో కలిసి వెళ్లటం లాంటివి చేయకుండా ఉండే బాగుండేది. అధికారపక్షంపై విమర్శలు చేయాల్సిన అవసరం లేకున్నా.. ఆరోపణలున్న నేతలతో పర్యటనలు చేయటం.. ప్రశంసలు చేయటం లాంటివి గవర్నర్ లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. లేకుండా.. ఇప్పటి మాదిరి విమర్శలకు లక్ష్యంగా మారాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.