Begin typing your search above and press return to search.

అనిల్ అంబానీని నిర్బధించాలని సుప్రీంలో కేసు

By:  Tupaki Desk   |   4 Jan 2019 12:51 PM IST
అనిల్ అంబానీని నిర్బధించాలని సుప్రీంలో కేసు
X
రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా మారింది. ఇప్పటికే ఆయనకు చెందిన కంపెనీలు భారీ అప్పుల్లో ఉన్నాయి. అప్పులు తీర్చేందుకు ఒకవైపు ఆయన సతమతమవుతుంటే మరోవైపు స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ అనే సంస్థ అనిల్ అంబానీని నిర్బంధించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

ఎరిక్సన్ సంస్థ టెలికాం పరికరాలు తయారు చేస్తుంది. అనిల్ అంబానీ తమ కంపెనీకి రూ.550 కోట్లు బకాయి పడ్డారని ఆ సంస్థ పిటిషన్ లో పేర్కొంది. తమ వద్ద భారీగా అప్పు చేసిన అనిల్ అంబానీ వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నదని వెంటనే ఆయనను నిర్బంధించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది.
రూ.550 కోట్ల బకాయిల చెల్లింపు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపింది. డబ్బులు చెల్లిస్తానని గతంలో కోర్టులో కూడా అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చినా దానిని నిలుపుకోలేదని ఆ సంస్థ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ సతమవుతుంటే దీనికితోడు ఆయనపై కోర్టు కేసులు గుదిబండగా మారుతున్నాయి. అనిల్ అంబానీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయన సోదరుడు ముఖేష్ అంబానీ ఏమైనా అతనికి సహాయం చేస్తే ప్రస్తుతానికి ఆయన గట్టేక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరీ తమ్ముడిని అన్నయ్య ఆదుకుంటారో లేక వ్యాపారంలో లాభనష్టాలు కమాన్ అని లైట్ తీసుకుంటారో వేచి చూడాలి మరీ.