Begin typing your search above and press return to search.

ఎప్పుడూ లేనంత‌... రూ.30 వేల కోట్ల పీఎఫ్ విత్ డ్రా

By:  Tupaki Desk   |   28 July 2020 2:00 PM IST
ఎప్పుడూ లేనంత‌... రూ.30 వేల కోట్ల పీఎఫ్ విత్ డ్రా
X
మహమ్మారి నేపథ్యంలో ఊహించ‌ని రీతిలో ఉద్యోగులు త‌మ పీఎఫ్‌ను ఉప‌సంహ‌రించుకుంటున్నారు. దీంతో ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి భారీగా నగదు ఉపసంహరణ జ‌రుగుతోంది. నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఏకంగా రూ.30 వేల కోట్ల పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకున్నారు. అది కేవ‌లం ఏప్రిల్ - జూలై మధ్యనే న‌గ‌దును ఉప‌సంహ‌రించుకున్నారు. 8 మిలియన్ల మంది పీఎఫ్‌ను తీసుకున్నారు.

ఈపీఎఫ్ఓ 60 మిలియన్ల ఉద్యోగులు, వారి యజమానుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రూ.10 లక్షల కోట్ల కార్పస్‌ను నిర్వహిస్తోంది. ఈపీఎఫ్ఓలోకి ఎప్పుడు ఎక్కువగా నిధులు వస్తాయి. కానీ వైర‌స్ వ్యాప్తి మొద‌ల‌వ‌డం.. లాక్‌డౌన్ విధించ‌డం.. అనంత‌రం ప‌రిస్థితులు మెరుగు కాక‌పోవ‌డంతో ఈసారి పెద్ద మొత్తంలో ఉపసంహరణలు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూలై మూడో వారం వరకు సాధారణంగా ప్రతి ఏడాది జరిగే ఉపసంహరణల కంటే అధికంగా జరిగింద‌ని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. మహమ్మారి కారణంగా ఉద్యోగాల కోత, వేతన కోత, వైద్య ఖర్చుల కోసం ఉపసంహ‌రించుకుంటున్నార‌ని తెలిపారు. మొత్తం ఉపసంహరణలలో 3 మిలియన్లు (30 లక్షలు) లబ్ధిదారులు కరోనా విండో కింద రూ.8 వేల కోట్లు విత్ డ్రా చేశారు. మిగిలిన రూ.22 వేల కోట్లను 50 లక్షల ఈపీఎఫ్ఓ చందాదారులు సాధారణ ఉపసంహరణ కింద తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా మెడికల్ అడ్వాన్స్‌లు ఉన్నాయి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్రజలకు ఆదాయం త‌గ్గ‌డంతో వారికి ఊర‌ట క‌ల్పించేలా కోవిడ్ కింద ఈపీఎఫ్ ఉపసంహరణకు అవకాశం కల్పించింది. దీంతో ఈపీఎఫ్ఈ ఉపసంహరణలు అనూహ్యంగా పెరిగాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో 10 మిలియన్ల మంది ఉద్యోగులు తమ న‌గ‌దు ఉపసంహరించుకునేలా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ FY2020లో 15 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు రూ.72,000 కోట్లు ఇచ్చింది. కానీ ఇప్పుడు నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ల మందికి చెల్లిస్తే ఈసారి నాలుగు నెలల్లోనే 8 మిలియన్లు దాటడం గ‌మ‌నార్హం. ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లు మొత్తంలో 75 శాతం లేదా మూడు నెలల వేతనం తీసుకునే వెసులుబాటు కల్పించిన విష‌యం తెలిసిందే.