Begin typing your search above and press return to search.

అనుభ‌వించు రాజా.. మ‌హారాష్ట్ర రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు విందు, వినోదాలు!

By:  Tupaki Desk   |   24 Jun 2022 4:18 AM GMT
అనుభ‌వించు రాజా.. మ‌హారాష్ట్ర రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు విందు, వినోదాలు!
X
మహారాష్ట్రలో శివ‌సేన సీనియ‌ర్ మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు లేవ‌నెత్తిన సంగ‌తి తెలిసిందే. 37 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల‌తో ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వంపై తిరుగుబాటు లేవ‌నెత్తారు. ప్ర‌స్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీ ఏలుబ‌డిలో ఉన్న అసోంలో క్యాంప్ వేసి ఉన్నారు. అక్క‌డ ఫైవ్ స్టార్ హోట‌ల్ అయిన‌ రాడిస‌న్ బ్లూలో ఉన్నారు. కాగా వారికి మంచి విందు, వినోదాలు అందుతున్నాయ‌ని తెలుస్తోంది.

అసోంలోని ముఖ్య న‌గ‌రం గువ‌హ‌టిలో ఎమ్మెల్యేలు ఏడు రోజులు బ‌స చేయ‌డానికి స‌క‌ల వ‌స‌తులతో కూడిన 70 గ‌దుల‌ను బుక్ చేశార‌ని స‌మాచారం. గ‌దుల అద్దె ఖ‌ర్చే రూ.56 ల‌క్ష‌ల రూపాయ‌లు అని చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేల భోజ‌నం, త‌దిత‌రాల కోసం రోజుకు ఏకంగా 8 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

రాడిస‌న్ బ్లూ ప్లాజా హోటల్‌లో విస్తృతమైన ఈవెంట్ స్థలం, అవుట్‌డోర్ పూల్, స్పా, ఐదు రెస్టారెంట్లు ఉన్నాయ‌ని స‌మాచారం. ఎమ్మెల్యేలు మొత్తం ఏడు రోజులు ఉండ‌టానికి రూ. 1.12 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది.

ప్ర‌భుత్వ ఏర్పాటులో తిరుగుబాటు ఎమ్మెల్యేల పాత్రే కీల‌కం కావ‌డంతో వారు అడిగింది కాద‌నుండా అందిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. అందులోనూ త‌మ‌కు ఒక జాతీయ పార్టీ మ‌ద్దతు ఉంద‌ని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే చెప్ప‌డం ఇందుకు ఊత‌మిస్తుంద‌ని అంటున్నారు. ఏక్ నాథ్ షిండే చెబుతున్న జాతీయ పార్టీ మ‌రేదో కాద‌ని.. బీజేపీయేన‌ని శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపీ విమ‌ర్శిస్తున్నాయి.

ఈ విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోని రెబల్ ఎమ్మెల్యేలు అసోంలోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో స్వ‌ర్గ సుఖాలు అనుభ‌విస్తున్నార‌ని సమాచారం. కోరుకున్న విందు, వినోదం పాదాక్రాంత‌మ‌వుతుంటే వారంతా మ‌స్తుగా ఎంజాయ్ చేస్తున్నార‌ని చెబుతున్నారు. రాచ‌భోగాలు వెల‌గ‌బెడుతున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఏక్ నాథ్ షిండే క్యాంపులో చేరే ఎమ్మెల్యేల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న క్యాంపులో 40 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది.

కాగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు జూన్ 22 ఉదయం గుజరాత్‌లోని సూరత్ నుంచి ప్ర‌త్యేక విమానంలో అసోంలోని గువ‌హ‌టికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అక్కడి నుంచి మూడు అసోం స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లగ్జరీ బస్సుల్లో ఎమ్మెల్యేలను ప‌టిష్ట పోలీసు భ‌ద్ర‌త మ‌ధ్య‌ రాడిసన్ బ్లూ హోటల్‌కు తరలించారు.