Begin typing your search above and press return to search.

ఆండర్సన్‌.. హిస్టరీ క్రియేట్ చేశాడు.. అతని రికార్డు దాటటం ఇప్పట్లో కష్టమే

By:  Tupaki Desk   |   29 Aug 2021 8:16 AM GMT
ఆండర్సన్‌.. హిస్టరీ క్రియేట్ చేశాడు.. అతని రికార్డు దాటటం ఇప్పట్లో కష్టమే
X
తిరుగులేనట్లుగా వ్యవహరిస్తూ.. ఇటీవల కాలంలో మెరుపులు మెరిపిస్తున్న టీమిండియాకు చుక్కలు చూపించటమే కాదు.. ఎంత బలహీనమైన జట్టో తెలుసా? అన్నట్లు చేసేశాడు ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్‌. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియాపై 76 పరుగుల తేడా విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టుకు ఆండర్సన్‌ ఒక ఆయుధంలా మారాడు. విచిత్రమైన విషయం ఏమంటే.. తాజా టెస్టు మ్యాచ్ లో దారుణంగా ఫెయిల్ అయిన కోహ్లీ సేన.. మూడేళ్ల క్రితం కూడా ఇదే ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడింది. అప్పుడు.. ఇప్పుడు టీమిండియా పాలిట విలన్ మరెవరో కాదు.. ఆండర్సన్‌.

నాడు తొమ్మిది వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన అతడు.. తాజాగా నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ లో జట్టు 78 పరుగులకే ఇన్నింగ్స్ ను క్లోజ్ చేయటానికి కారణంగా ఇతగాడే. కీలకమైన కేఎల్ రాహుల్.. కోహ్లి.. పుజారా వికెట్లను వరుస పెట్టి తీసి టీమిండియా కోలుకోలేని దెబ్బ తీశాడు. తాజా టెస్టు మ్యాచ్ దారుణ ఓటమిలో కీలకభూమిక పోషించాడు. డబుల్ థమాకా అన్నట్లుగా.. టీమిండియా మీద విజయం అతనికి సంతోషకరమైన వార్త అయితే.. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ టెస్టు మ్యాచ్ ద్వారా అతగాడు హిస్టరీ క్రియేట్ చేశాడు.

తాజా మ్యాచ్ లో అజింక్య రహానే వికెట్ ను పడగొట్టటం ద్వారా ఆండర్సన్‌ ఇంగ్లండ్ గడ్డ మీద 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా ఆయన రికార్డుల్లోకి ఎక్కాడు. అతగాడి ముందు ఇంగ్లండ్ లో మరే బౌలర్ కూడా ఇంతటి ఘనతను సాధించలేదు. ఆండర్సన్‌ తర్వాతి స్థానంలో 341 వికెట్లతో స్టువర్ట్ బ్రాడ్.. 229 వికెట్లతో ఫ్రెడ్ ట్రూమన్ మాత్రమే ఉన్నారు. ఓవరాల్ గా సొంతగడ్డ మీద 400 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా శ్రీలంకకు చెందిన మురళీధరన్ ఉన్నారు. అతని తర్వాత ఆండర్సన్‌ కాగా తర్వాతి స్థానంలో టీమిండియా బౌలర్ అనిల్ కుంబ్లే 350 వికెట్లతో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ 341 వికెట్లు.. షేన్ వార్న్ 319 వికెట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు.

ఇతగాడి ఖాతాలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు అత్యధిక మొయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా నిలుస్తారు. ఇప్పటివరకు ఇతను టీమిండియా జట్టుకు 330 మెయిడిన్ ఓవర్లు వేశారు. గతంలో ఈ రికార్డు మాజీ బౌలర్ డెరెక్ అండర్ వుడ్ పేరుతో ఉండేది. అతగాడు భారత్ పై 322 మెయిడిన్ ఓవర్లు వేశారు. మొత్తానికి చిత్తుగా ఓడిన టీమిండియా.. రానున్న మ్యాచుల్లో అయినా చెలరేగిపోతారో.. చిత్తుగా ఓడిపోతారో చూడాలి.