Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ కలలకు కళ్లెం వేస్తున్న ఇంజినీరింగ్ లెజెండ్

By:  Tupaki Desk   |   15 Jun 2019 7:16 AM GMT
కేజ్రీవాల్ కలలకు కళ్లెం వేస్తున్న ఇంజినీరింగ్ లెజెండ్
X
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో దిల్లీలోని ఏడుకు ఏడు సీట్లనూ బీజేపీ గెలుచుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వెన్నులో వణుకుపుట్టింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో ఆయన చాలా కంగారు పడ్డారు. ఇదే ఊపులో బీజేపీ ఈసారి దిల్లీ సీఎం పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటుందేమో అని తెగ టెన్షన్ పడ్డారు. అయితే.. అంత టెన్షన్లోనూ ఆయన బుర్ర బాగానే పనిచేసింది. మమతా బెనర్జీలా స్థిమితం కోల్పోకుండా ఆయన అసెంబ్లీ ఎన్నికల బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించారు. అది... దిల్లీ ప్రజలకు ప్రధాన రవాణా సాధనమైన మెట్రో రైలులో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించడం. ఇది నిజంగానే ఓట్లు కురిపించే ఎత్తుగడే. అయితే... ఆయన ప్లాను ఇప్పుడు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కారణం.. దిల్లీ మెట్రో రైలు రూపకర్త, ప్రముఖ ఇంజినీర్ శ్రీధరన్ ఆ ప్రతిపాదనకు తీవ్రంగా అభ్యంతరం చెబుతుండడమే.

మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సమ్మతించవద్దంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మహిళలకు సాయం చేయాలని కేజ్రీవాల్ సర్కారుకు అంత కోరికగా ఉంటే, ఉచిత ప్రయాణం చేయించే బదులు నేరుగా టికెట్ రుసుమును చెల్లించవచ్చు కదా అంటూ శ్రీధరన్ ప్రశ్నించారు. దిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నడిచే సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఓ భాగస్వామి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కుదరదని తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని శ్రీధరన్ హితవు పలికారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.

శ్రీధరన్ గతంలో దిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ కు చీఫ్ గా వ్యవహరించారు. దేశంలో మెట్రో వ్యవస్థకు ఆయన్ను ఆద్యుడిగా భావిస్తారు. మెట్రోమ్యాన్ అనేది ఆయనకు బిరుదుగా మారిపోయింది. అయితే.. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రతిపాదనను కాదంటే తమ పట్ల వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో బీజేపీ ఆచితూచి ఇలా శ్రీధరన్ రూపంలో దీన్ని అడ్డుకుంటోందన్న వాదన ఒకటి వినిపిస్తోంది.