Begin typing your search above and press return to search.

వాడ్నేం అనాలి; క్రేన్ ప్రమాదం దేవుడు చేసిందట

By:  Tupaki Desk   |   14 Sept 2015 10:19 AM
వాడ్నేం అనాలి; క్రేన్ ప్రమాదం దేవుడు చేసిందట
X
మనుషులు చేసే తప్పుల్ని దేవుడి మీద నెట్టేయటం అప్పుడప్పుడు జరుగుతుంది. అలాంటిదే తాజాగా చోటు చేసుకుంది. మక్కా మసీదు వద్ద అభివృద్ధి పనుల్లో భాగంగా భారీ క్రేన్ తో పనులు చేపట్టటం.. దాని పై భాగం కూలిపోయిన ఘటనలో 107 మంది మరణించటం తెలిసిందే.

మక్కాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం పెను సంచలనమైన ఘటన తెలిసిందే. భారీ క్రేన్ పై నుంచి పడిపోవటం ఇంత మంది మరణానికి కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. జరిగిన ప్రమాదంపై క్రేన్ తప్పేం లేదని.. అదంతా దేవుడి నిర్ణయమని ఒక సౌదీ ఇంజనీర్ చేస్తున్న వాదన పలువురికి మంట పుట్టేలా చేస్తోంది.

గత మూడు.. నాలుగేళ్లుగా సాగుతున్న క్రేన్ వర్క్ కారణంగా ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని.. అలాంటిది ఇప్పుడే ఇలా జరిగిందంటే.. దానికి కారణం దేవుడి నిర్ణయమేనని ఆయన చెప్పినట్లుగా వచ్చిన వార్తపై పలువురు మండిపడుతున్నారు.సదరు ఇంజనీర్ మరో మాట కూడా చెబుతున్నారట. క్రేన్ ను కిందకు పడేసే శక్తి కేవలం మానవాతీత శక్తులకు మాత్రమే ఉందని.. సాంకేతికంగా ఎలాంటి తప్పు లేదని వాదిస్తున్నారట. చూస్తుంటే.. క్రేన్ సాంకేతికతను అందిస్తున్న సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ కు సంబంధించిన ఎలాంటి తప్పు లేదని చెప్పుకోవటానికి ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తున్నట్లు కనిపించట్లేదు.