Begin typing your search above and press return to search.

పీఆర్సీపై సర్కార్‌కు నెలాఖరు డెడ్‌లైన్..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 10:30 AM GMT
పీఆర్సీపై సర్కార్‌కు నెలాఖరు డెడ్‌లైన్..!
X
‘‘మేం దాచుకన్న డబ్బులు కూడా ఇవ్వరా..? వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీకే విలువ లేదా?’’అంటూ ఏపీలో ఉద్యోగ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పీఆర్సీ జాప్యం మీద సర్కారుపై మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్యలు తాము పోరుబాట పట్టేలా చేస్తున్నాయని అంటున్నాయి. వెరసి చివరకు జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించేవరకు వెళ్లాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు వరకు వేతన సవరణ ప్రకటించాలని పట్టబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వానికి నెలాఖరును డెడ్ లైన్ పెట్టాయి. ఈ నెల 27న అంటే.. శనివారం అన్ని సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీన్నిబట్టి చూస్తే .. ఏపీలో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త దూరం పెరుగుతోందని తెలిసిపోతోంది.

ఎన్నికల ముందు హామీలను ప్రస్తావిస్తూ..

పీఆర్సీ జాప్యం మీద గుర్రుగా ఉన్న ఉద్యోగ నేతలు.. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తున్నారు. అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ హామీని అమలు చేయనేలేదని అంటున్నారు బండి శ్రీనివాసరావు. వైసీపీకి 151 సీట్లు రావడంలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని, ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అవసరం లేదా? ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం పీఆర్సీ నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలను మార్చి నాటికి ఇస్తామని చెప్పారని.. దీంతో శుక్రవారం నాటి సమావేశాన్ని బహిష్కరించినట్లు చెప్పారు. ‘మా రెండు ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో 200 సంఘాలున్నాయి.

మా సంఘాలన్నీకింది స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి’’అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కారు వచ్చాక ఒక్క డీఏ కూడా రాలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు విమర్శించారు. పీఆర్సీ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని తప్పుబట్టారు. పీఆర్సీ నివేదిక మీద అధికారుల కమిటీ పరిశీలనపై తమకు నమ్మకం లేదని, కమిటీలు కాలయాపనకే గానీ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాదని ఆరోపించారు. ఉద్యోగులకి చ్చిన హెల్త్ కార్డులు.. అనారోగ్య కార్డులుగా మారాయని విమర్శించారు.

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. పీఆర్సీ ‘‘పీటముడి ’’

ఉద్యోగ సంఘాలు ఇంత ఇవ్వాలని కోరతాయి.. ప్రభుత్వాలేమో ఇంత ఇస్తామంటాయి.. మధ్యలో ప్రతిష్ఠంభన.. చర్చలు.. సాగదీతలు.. మొండి పట్టుదలలు.. ఆఖరుకు ప్రభుత్వం కొంత మొగ్గుతుంది.. ఉద్యోగ సంఘాలు కొంత తగ్గుతాయి. ఇదీ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) విషయంలో ఎంతోకాలంగా మనం చూస్తున్న క్రమం. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఇదే సీన్. అయితే, పీఆర్సీ అంటే ఏదో సర్కారు కేటాయింపులు.. నాలుగు ఉద్యోగ సంఘాల డిమాండ్ కాదు. దీనివెనుక లక్షలాది ఉద్యోగుల ఎదురుచూపులుంటాయి. వారి కుటుంబాల అవసరాలుంటాయి. కానీ, పీఆర్సీలు ఎప్పుడు ప్రకటించినా.. వివాదాలు మాత్రం మామూలే.

ఎందుకిలా..?

వివాదానికి ఉద్యోగుల డిమాండ్లు.. పీఆర్సీ సిఫార్సుల మధ్యనే మొదటి అడుగు పడుతుంది. వాస్తవానికి పీఆర్సీ నివేదిక అమలు ప్రభుత్వ విధి. దానికన్నా ముందు ఉద్యోగ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేదా మంత్రుల కమిటీతో బేరసారాలు చేయడం మామూలే.

ఎందుకంటే నివేదికలో సిఫారసు చేసినట్లు ఫిట్మెంట్ ను ఉద్యోగ సంఘాలు అంగీకరించవు. ఇక్కడే పీటముడి పడుతుంది. సంఘాలు కోరినంతగా ఫిట్ మెంట్ ను ప్రభుత్వం కూడా ఆమోదించదు. కాబట్టి మధ్యేమార్గంగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతల మధ్య బేరసారాలు జరిగి ఏదో ఓ శాతం దగ్గర అంగీకారం కుదురుతుంది. నివేదికను ఎప్పటి నుంచి అమలు చేయాలని, బకాయిల విషయంలో కూడా చర్చలు జరిగే చివరకు ఏదో ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం ప్రకారమే పీఆర్సీ నివేదిక అమలవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆలోగాఇంటెరిమ్ రిలీఫ్ (ఐఆర్) అమలవుతుంది. ఇపుడు 27 శాతం ఐఆర్ అమలవుతోంది. ఈ పద్దతి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉద్యోగసంఘాల నేతలుగా ఎవరున్నా జరిగేదిదే.

అయితే గతంలో ఎన్నడు లేనివిధంగా ఇపుడు పీఆర్సీ నివేదిక అమలు వివాదాస్పదమవుతోంది. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి మీదే ప్రధానంగా పీఆర్సీ నివేదిక అమలు ఆధారపడుటుంది. ఇపుడు రాష్ట్ర ఆర్ధికపరిస్దితి ఏమాత్రం బాగాలేదని తెలిసిందే. అప్పులతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి స్థితిలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ నివేదిక అమలుకు పట్టుబడుతున్నాయి. ఇదే సమయంలో పీఆర్సీ నివేదిక ఎలా అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి తలనొప్పి.

ఆర్ధిక పరిస్థితి తో సంబంధం లేకుండా తమకు మంచి జీతాలు రావాలనే ఉద్యోగులు కోరుకుంటారు. అయితే ఇక్కడ సమస్యేమిటంటే పీఆర్సీ నివేదికను తమ పరిశీలనకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వాన్ని పదే పదే ఎందుకు డిమాండ్ చేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది ? నివేదిక కాపీని ఉద్యోగసంఘాల నేతలకు ఇవ్వటమన్నది ప్రభుత్వం కనీస బాధ్యత. నివేదిక కాపీని నేతలకు ఇవ్వటం వేరు, నివేదిక అమలు వేరని ప్రభుత్వానికి తెలీదా ?

పీఆర్సీ నివేదికపై ప్రభుత్వంతో చర్చలు జరపాలంటే నివేదిక కాపీని చూడందే ఉద్యోగ సంఘాల నేతలు ఏమి మాట్లాడగలరు ? ఇంత చిన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఎందుకు పెద్దది చేసుకుంటున్నదో అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రికి ఒకమాట చెప్పి నివేదిక కాపీని ఉద్యోగ సంఘాల నేతలకు ప్రధాన కార్యదర్శి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటోందనే సామెతలో చెప్పినట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. ఇదే విషయమై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నేతలతో ప్రభుత్వం సమావేశమవుతోంది. పీఆర్సీ నివేదిక కాపీని వెంటనే ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చేస్తే సగం సమస్య పరిష్కారమవుతుంది.