Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు ఐపీఎస్‌ లు...వీరప్ప‌న్‌ ను చంపిన అధికారికే ఆ చాన్స్‌

By:  Tupaki Desk   |   10 Aug 2019 10:43 AM GMT
ఇద్ద‌రు ఐపీఎస్‌ లు...వీరప్ప‌న్‌ ను చంపిన అధికారికే ఆ చాన్స్‌
X
ఇప్పుడు ఎక్క‌డ చూసినా చ‌ర్చంతా జ‌మ్మూక‌శ్మీర్ గురించే. ఆ రాష్ట్రం విడివ‌డిన తీరు స‌హా అనేక అంశాల గురించి చ‌ర్చ‌. అయితే, ఈ చ‌ర్చ‌లోనే మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ ను నియ‌మించ‌నున్నారు అనేది ఈ వార్త. ఎందుకు ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి అంటే... కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ ను 2004 అక్టోబర్‌ లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ నేప‌థ్యంలోనే... విజయ్ కుమార్‌ తో పాటు రిటైర్డ్ ఐపీఎస్ దినేశ్వర్ శర్మ పేరు కూడా వినిపిస్తున్న‌ప్ప‌టికీ...విజ‌య్‌కే ఆ అవ‌కాశమ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త‌వారం వ‌ర‌కూ జ‌మ్మూక‌శ్మీర్ ఒక రాష్ట్రంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌, లఢక్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మ‌డి రాష్ట్రానికి గవర్నర్‌ గా సత్యపాల్ మాలిక్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించడం త‌ప్ప‌నిస‌రి అయింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ పేరు సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్‌ కు మిత్రుడు కావడంతో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా పంపుతారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరిగిన‌ప్ప‌టికీ...విజ‌య్ పేరు ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

మీడియాలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.వీరప్పన్‌ ను అంత‌మొందించ‌డంతో విజయ్ పేరు మారుమోగిపోయింది. అత్యంత పకడ్బందీగా ఆపరేషన్‌ ‌ను చేపట్టి వీరప్పన్‌ ను మట్టుబెట్టారు. అంతేకాకుండా వామపక్ష తీవ్రవాదాన్ని మట్టుబెట్టడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. 2008లో హైదరాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌ గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌ గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌ గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌ కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్ గవర్నర్‌ కు సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌ గా గుర్తింపు పొందిన విజయ్‌ నియమానికి రాష్ట్రపతి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది.

ఇదిలాఉండ‌గా, మ‌రో ఐపీఎస్ దినేశ్వర్ శర్మ. వేర్పాటువాదాన్ని అణచివేయడంలో దిట్టగా పేరున్న ఈయ‌న 1976 కేరళ బ్యాచ్‌ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఐబీ చీఫ్‌ గా బాధ్యతలు నిర్వర్తించిన శ‌ర్మ‌ను మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ వ్యవహారాల కోసం ప్ర‌త్యేకంగా మధ్యవర్తిగా నియమించింది. ఆ అనుభ‌వంతో ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ పీఠం ద‌క్కించుకునే చాన్సుంద‌ని అంటున్నారు.