Begin typing your search above and press return to search.

ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు..: బీఆర్టీఎస్ రోడ్ లో ఉద్రిక్తత..

By:  Tupaki Desk   |   3 Feb 2022 6:08 AM GMT
ఒక్కసారిగా దూసుకొచ్చిన ఉద్యోగులు..: బీఆర్టీఎస్ రోడ్ లో ఉద్రిక్తత..
X
ఏపీలో పీఆర్చీ రగడ పెద్దదవుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగులు భారీగా విజయవాడకు చేరుకుంటున్నారు. అయితే ఉద్యోగుల ఆందోళన ప్రభుత్వం అనమతి ఇవ్వకపోయినా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని పట్టుబడుతున్నారు. అటు ప్రభుత్వం మాత్రం దీనిపై ప్రత్యేక నిఘా పెట్టింది. విజయవాడకు ఉద్యోగులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి అరెస్టు చేస్తున్నారు. అయితే కొందరు ఉద్యోగులు ఇప్పటికే విజయవాడకు చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని బీఆర్టీఎస్ రోడ్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు ఎక్కడా కనిపించని ఉద్యోగులు ఒక్కసారిగా వందలాది మంది రోడ్లపైకి వచ్చారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉన్న జెండాలను పట్టుకొని ఆందోళన చేశారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు. ఆయా ప్రదేశాల్లో నివాసం ఉండి ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చారు. దీంతో పోలీసులు వారిని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. దీంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఆర్సీలో కొన్ని లోపాలున్నాయని, తమ డిమాండ్లకు అనుగుణంగా పీఆర్సీని ప్రవేశపెట్టాలని ఉద్యోగులు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవడం లేదు. అంతేకాకుండా 11వ పీఆర్సీ ఉద్యోగులకు మేలు చేసేవిధంగానే ఉందని, కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళన నిర్వహించడం సరికాదని అంటున్నారు. కానీ కొత్త పీఆర్సీతో తమ జీతంలో కోతపడుతుండడంతో పాటు భవిష్యత్లో తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో ఫిట్మెంట్ తో పాటు అవసరాలకు అనుగుణంగా పీఆర్సీని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

-పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ధరించి ఉద్యోగులు ఆందోళన చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని.. తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నేను ఉన్నాను... నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్‌ అన్నారని.. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమని ఉద్యోగులు మండిపడ్డారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారని తెలిపారు.

నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నామని.. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడమన్నారు.

సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఉద్యోగులు హెచ్చరించారు. మేం ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో కాదు.. అణచివేత తగదు అంటూ ఉద్యోగులు హెచ్చరించారు. ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన చెందారు. బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయించారు.

అయితే బుధవారం నిర్వహించే ఆందోళనలో పాల్గొన్న ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయడం లేదని ప్రభుత్వం హెచ్చరించింది. అందువల్ల ప్రతీ ఒక్కరు తమ విధుల్లో పాల్గొనాలని సూచించారు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని వియజవంతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల ముందే విజయవాడకు చేరుకొని తమ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాప్ చేసుకున్నారు. కానీ బుధవారం ఉదయం ఒక్కసారిగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోకి ఉద్యోగులు దూసుకురావడం ఆందోళన వాతావరణం ఏర్పడింది.