Begin typing your search above and press return to search.

అనంతపురం కియా ఫ్యాక్టరీలో ఇనుప రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు

By:  Tupaki Desk   |   21 Sept 2021 5:00 PM IST
అనంతపురం కియా ఫ్యాక్టరీలో ఇనుప రాడ్లతో కొట్టుకున్న ఉద్యోగులు
X
అనంతపురం కియా పరిశ్రమలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారింది. ఉద్యోగులు ఇనుప రాడ్లతో పరస్పరం తీవ్ర దాడులకు పాల్పడ్డారు. జూనియర్లు, సీనియర్లు అంటూ పరస్పరం నిందించుకుంటూ ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టుకున్నారు.

ఈ దాడి ఘటనను కంపెనీలోని పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంత భయానకంగా కొట్టుకుంటారా? అని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది.

అనంతపురంలోని కియా కంపెనీలోని ప్రధాన ప్లాంట్లు అయిన హుందాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచూగా గొడవలు జరుగుతుంటాయట.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం. ఇంతకాలం స్వల్ప వివాదాలే జరుగుతుండగా.. ఇవాళ మాత్రం భయానక రీతిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చినికి చినికి గాలివానలా మారి చివరకు ఇనుపరాడ్లతో బాదుకునే వరకూ వెళ్లింది.

రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులతో కియాలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులు వణికిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం భయంగా గడుపుతున్నారు.

కంపెనీ నిర్వాహకులు మాత్రం ఈ ఘర్షణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.