Begin typing your search above and press return to search.

ఫ్రాన్స్ చరిత్రలో యంగెస్ట్ ప్రెసిడెంట్ మాక్రాన్

By:  Tupaki Desk   |   8 May 2017 6:51 AM GMT
ఫ్రాన్స్ చరిత్రలో యంగెస్ట్ ప్రెసిడెంట్ మాక్రాన్
X
ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎన్ మార్చె మూవ్‌ మెంట్‌ కు చెందిన ఎమ్మాన్యుయెల్ మాక్రాన్(39) విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి - నేషనల్ ఫ్రంట్‌ కు చెందిన డైనమిక్ లీడర్ లీ పెన్ ఓటమి పాలయ్యారు. 65 శాతం మేర ఓట్లు పోలయినట్లు తెలిసింది. పోలయిన వాటిలో 65.5 శాతం నుంచి 66.1 శాతం మేర మాక్రాన్‌ కే అనుకూలంగా పడినట్లు ఎగ్జిట్‌ పోల్స్ ద్వారా స్పష్టమైంది.

నిండా 40 సంవత్సరాలు కూడా లేని మాక్రాన్ కు ఫ్రాన్స్ ప్రజలు పట్టం కట్టడం వెనుక అనేక కారణాలున్నాయి. మాక్రాన్ యూరప్ - వాణిజ్య అనుకూల మధ్యేవాదికాగా - 48 ఏండ్ల లీ పెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరే వలసల వ్యతిరేకి. సోషలిస్టు పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు మరోసారి ఎన్నికల్లో పోటీచేసే అవకాశమున్నా అందుకు ఆయన నిరాకరించారు.

నిజానికి మాక్రాన్ నాలుగేళ్ల కిందట ఫ్రాన్స్ రాజకీయాల్లో ఒక అనామకుడనే చెప్పాలి. ఆయన ఒక ఉద్యోగి... ఆ తరువాత ఇన్వెస్టమెంటు బ్యాంకర్ గా మారి మిలియనీర్ గా పేరు తెచ్చుకున్నారు.. అనంతరం ఫ్రాన్స్ కు ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడయ్యారు.

ఆయనకు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర కానీ... దేశవ్యాప్తంగా నెట్ వర్కు - ఓటు బ్యాంకు కానీ ఏమీ లేవు. కానీ.. ప్రజాదరణ మాత్రం భారీగా ఉండడంతో గెలుపు సులభమైంది. గత ప్రభుత్వాలు విఫలమైన అంశాల్లో స్పష్టమైన హామీలిచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. నిరుద్యోగం, ఉపాధ్యయులు వంటివారికి జీతాల పెంపు తదితర హామీలు బాగా కలిసొచ్చాయి.

ఇక మాక్రాన్ వ్యక్తిగత జీవితం గురించి తెలిస్తే షాకే. ఆయన తాను చదువుకున్న రోజుల్లో తనకు పాఠాలు చెప్పిన టీచర్ నే పెళ్లాడాడు. 39 ఏళ్ల వయసున్న మాక్రాన్ భార్య బ్రిగిట్టె వయసు ఇప్పుడు 64. భర్త, ముగ్గురు పిల్లలున్న బ్రిగిట్టెతో మాక్రాన్ ప్రేమాయణం, పెళ్లి మొదలైనవన్నీ వినటానికి వింతగానే ఉంటాయి. వీరిద్దరూ 1990లలో తొలిసారిగా కలుసుకున్నారు. ఫ్రెంచ్ - లాటిన్ - ఇంగ్లిష్ - డ్రామా పాఠాలు నేర్పించే ఉపాధ్యాయురాలు బ్రిగిట్టె దగ్గరికి మాక్రాన్ వచ్చి స్క్రిప్ట్ రాయటం తనకు నేర్పించమని విజ్ఞప్తి చేశాడు. అప్పుడతడి వయస్సు కేవలం 15 ఏండ్లు. బ్రిగిట్టె వయస్సు 40. అప్పటికే జాక్వెస్ అండ్ హిస్ మాస్టర్ అనే నాటకంలో మాక్రాన్ నటన చూసి ముగ్ధురాలైన బ్రిగిట్టె.. అందుకు అంగీకరించారు. రెండేండ్లలోనే వారి మధ్య అనుబంధం గట్టిపడింది. పెళ్లంటూ చేసుకుంటే ఆమెను చేసుకోవాలని మాక్రాన్ నిర్ణయించుకుని.. 17 ఏళ్ల వయసులోనే ధైర్యంగా ఆమెకు ఆ సంగతి చెప్పేశారు. ఆమెకు కూడా మాక్రాన్ నచ్చడంతో 2006లో తన భర్త ఆండ్రీలూయిస్ అజీరె నుంచి బ్రిగిట్టె విడిపోయారు. మరుసటి ఏడాది మాక్రాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన మాక్రాన్‌ కు పూర్తి అండగా నిలిచారు. మాక్రాన్‌తో జీవితం పంచుకుంటున్నా.. మొదటిభర్త ద్వారా పుట్టిన ముగ్గురు పిల్లల కుటుంబాలను, ఏడుగురు మనుమలు, మనుమరాండ్లను బ్రిగిట్టె ఇప్పటికీ ఆదరిస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/