Begin typing your search above and press return to search.

ఆమె రెండు నెలల్లో.. 242 కేజీలు త‌గ్గింది!

By:  Tupaki Desk   |   12 April 2017 9:35 AM GMT
ఆమె రెండు నెలల్లో.. 242 కేజీలు త‌గ్గింది!
X
ఆమె ఇక ప్ర‌పంచంలో అత్యంత బరువైన మ‌హిళ కానేకాదు. రెండు నెల‌ల కింద‌ట ముంబైలో అడుగుపెట్టే స‌మ‌యానికి త‌న పేరిట ఉన్న ఆ రికార్డును ఈ ఈజిప్ట్ మ‌హిళ ఎమాన్ అహ్మ‌ద్ చెరిపేసుకుంది. రెండు నెలల్లోనే ఆమె ఏకంగా 242 కేజీల బ‌రువు త‌గ్గింది మ‌రి. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్ట‌ర్ ముఫ‌జ‌ల్ ల‌క్డావాలా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వైద్యరంగంలో ఆయ‌న అందించిన సేవ‌ల‌కుగాను మ్యాన్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు అందుకున్న‌సంద‌ర్భంగా ల‌క్డావాలా.. ఎమాన్ గురించి, ఆమెకు అందించిన శ‌స్త్రచికిత్స గురించి వివ‌రించారు

ఫిబ్ర‌వ‌రి 11న ఆమె ముంబైలో అడుగుపెట్టే స‌మ‌యానికి 490 కేజీల బ‌రువుంది. అయితే వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాలు పాటించి 100 కేజీలు త‌గ్గింది. మార్చి 7న ఆమెకు స‌ర్జరీ జ‌రిగింది. ఎక్కువ ఆహారం తిన‌కుండా 75 శాతం ఆమె ఉద‌ర‌భాగాన్ని తొల‌గించారు. దీంతో మార్చి 29నాటికి 340 కిలోల‌కు త‌గ్గింది. బేరియాట్రిక్ స‌ర్జ‌రీ త‌ర్వాత ఏడాదిన్న‌ర‌లో ఆమె 150 కేజీలు త‌గ్గుతుంద‌ని డాక్ట‌ర్లు భావించారు. అయితే ఆమె మాత్రం కేవ‌లం 13 రోజుల్లో మ‌రో 98 కేజీలు త‌గ్గ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. దీంతో ఆమె ఆరోగ్యం మెరుగైంది. గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ సాధార‌ణంగా ప‌నిచేస్తున్నాయి. త‌న బ‌రువు కార‌ణంగా 20 ఏళ్లుగా ఇంట్లో నుంచి అడుగు బ‌య‌ట‌పెట్ట‌ని ఎమాన్‌.. త్వ‌ర‌లోనే సాధార‌ణ జీవితం గ‌డ‌ప‌బోతుంది. అయితే అప్పుడప్పుడూ శ‌రీరంలో కుడిభాగం ప‌నిచేయ‌క‌పోవ‌డం, ఫిట్స్‌లాంటివి వ‌స్తూనే ఉన్నాయి. వాటికి వైద్యం చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/