Begin typing your search above and press return to search.

ఈ కారు త్వ‌ర‌లో అంగార‌కుడి ద‌గ్గ‌రకు వెళుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   3 Dec 2017 4:42 AM GMT
ఈ కారు త్వ‌ర‌లో అంగార‌కుడి ద‌గ్గ‌రకు వెళుతుంద‌ట‌
X
సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం.. క‌ల‌లో కూడా ఊహించ‌లేని ముచ్చ‌ట్లు చెప్ప‌టం స్పేస్ ఎక్స్ సీఈవో మ‌స్క్ అల‌వాటే. తాజాగా అలాంటి ముచ్చ‌టే చెప్పి ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. మ‌ళ్లీ మ‌ళ్లీ వాడుకునేలా స‌రుకుల చేర‌వేసే రాకెట్లు త‌యారు చేయాల‌న్నా.. అంగార‌కుడిపై మ‌నుషుల కోసం కాల‌నీ నిర్మిస్తాన‌ని చెప్పాల‌న్నా మ‌స్క్‌ కు మాత్ర‌మే సాధ్యం. సాధ్యం అవుతుందో లేదో కానీ స‌రికొత్త ఆలోచ‌న‌ను పంచుకునే మ‌స్క్‌.. తాజాగా తాను చేసిన ట్వీట్ తో ప్ర‌పంచానికి చాలానే ప్ర‌శ్న‌లు మిగిల్చాడు.

ఇంత‌కీ ఆయ‌న చేసిన తాజా ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ఫాల్క‌న్ హెవీ రాకెట్ ద్వారా అంగార‌కుడి క‌క్ష్య‌లోకి కారును పంపుతాన‌ని వెల్ల‌డించాడు. వ‌చ్చే నెల ఫ్లోరిడాలోని కేప్ కెన‌వ‌ర‌ల్ లో తొలి ప్ర‌యోగం జ‌రుగుతుంద‌ని.. త‌న మిడ్ నైట్ చెర్రీ క‌ల‌ర్ కారును టెస్లా రోడ్ స్ట‌ర్ ను అంగార‌కుడి క‌క్ష్య‌లోకి పంప‌నున్న‌ట్లు చెప్పారు. అంగార‌కుడి క‌క్ష్య పైకి ఎగిరేట‌ప్పుడు తాను పంపిన కారు పేల‌కుంటే వంద‌ల కోట్ల సంవ‌త్స‌రాలు అంత‌రిక్షంలో ఉండిపోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

మూడు నాలుగు ట‌న్నుల ఉప‌గ్ర‌హాల్ని అంత‌రిక్షంలోకి పంపుతున్న వేళ‌.. కారును ప్ర‌యోగించ‌టం క‌ష్ట‌మేమీ కాదు. కానీ.. కారును పంపి ఏం చేయాల‌నుకుంటున్నారు? అన్న‌దే ప్ర‌శ్న‌. దానికి స‌రైన సమాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. అంత‌రిక్షంలోకి కారు ప్ర‌యోగం ఎందుకు? దాని ల‌క్ష్యం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి. ఈ ప్ర‌శ్న‌ల‌కు మ‌స్క్ స‌మాధానం తెలియాలంటే అత‌గాడి మ‌రో ట్వీట్ చేసే వ‌ర‌కూ ఆగ‌క త‌ప్ప‌నిస‌రి. మొత్తానికి త‌న స‌రికొత్త ఆలోచ‌న‌తో ప్ర‌పంచాన్ని త‌న‌వైపు చూసేలా చేసిన మ‌స్క్‌.. కారు ప్ర‌యోగం స‌క్సెస్ కంటే ముందే విజ‌యాన్ని సాధించార‌ని చెప్పాలి.