Begin typing your search above and press return to search.

ఈ భూమ్మీద పుతిన్ కు సవాలు విసిరే ఏకైక మగాడు అతడేమో?

By:  Tupaki Desk   |   15 March 2022 2:29 AM GMT
ఈ భూమ్మీద పుతిన్ కు సవాలు విసిరే ఏకైక మగాడు అతడేమో?
X
మొండితనం.. అంతకు మించిన మూర్ఖత్వం అతడి సొంతం. అన్నింటికి మించి పేరుకు ప్రజా పాలకుడే కానీ.. నియంతగా సుపరిచితుడు.. తనకున్న బలంతో తాను టార్గెట్ చేసిన దేశాల్ని సొంతం చేసుకోవాలని తపించే పాలకుడిగా రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ చాలా ఫేమస్. తనను.. తన తప్పుల్ని ఎత్తి చూపే వారు ఎవరైనా.. ఏ సంస్థనైనా నామ రూపాల్లేకుండా చేయటంలో అతడి తర్వాతే మరెవరైనా. చివరకు తనకు కంట్లో నలుసులా మారిన ప్రతిపక్ష నేతను సైతం వదలకుండా జైల్లో పడేసి.. దారుణహింసకు గురి చేస్తూ.. దేశాన్నే కాదు ప్రపంచం సైతం పరిమితంగా మాత్రమే మాట్లాడేలా చేయటంలో అతడి తర్వాతే.

ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలోనూ సామ్రాజ్యవాద కాన్సెప్టును బలంగా నమ్మి.. అందుకు తగ్గట్లే పావులు కదిపే పుతిన్ కారణంగా ఇప్పుడు ప్రపంచానికి పెద్ద ముప్పే వచ్చి పడింది. ప్రపంచ దేశాల్లో నియంతలకు కొదవ లేదు. కానీ.. పుతిన్ వ్యవహారం అందుకు భిన్నం. చూస్తుండగానే మహా శక్తిగా మారటమే కాదు.. తనకున్న కేజీబీ (రష్యన్ గూఢాచార సంస్థ) అండతో చెలరేగిపోయి.. ఎవరినైనా సరే మట్టుబెట్టగలిగిన సత్తా అతడి సొంతం.

పుతిన్ పుణ్యమా అని.. ప్రపంచ వ్యాప్తంగా అశాంతి.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని అనిశ్చితి అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇలాంటి వేళలో..ఒక పారిశ్రామిక దిగ్గజం నేరుగా సవాలు విసిరి మరీ గోదాలకు దిగటం.. దమ్ముంటే ఒంటరిగా యుద్ధం చేయ్ అంటూ వ్యాఖ్యలు చేయటం టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు మాత్రమే సాధ్యమేమో?

తమ దేశానికి పక్కనే ఉన్న ఉక్రెయిన్ ను టార్గెట్ చేసి.. దారుణ పరిస్థితుల్ని ప్రపంచానికి చూపిస్తున్న పుతిన్ కారణంగా ఆ దేశం మరెప్పటికి కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి. యుద్ధంతో జరిగిన నష్టం ఉక్రెయిన్ దేశస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తమ సోదర దేశంపై సొంత సైనిక బలగాలు ఇష్టారాజ్యంగా విరుచుకుపడుతున్న వైనాన్ని రష్యన్లు సైతం వ్యతిరేకిస్తున్నారు.

ప్రపంచ వ్యాపార దిగ్గజాలతో పాటు.. తనకు ఏదైనా విషయం కొత్తగా అనిపించిన వెంటనే సోషల్ మీడియాలో పంచుకునే అలవాటు టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలన్ మాస్క్అలవాటు. రష్యా తీరుపై మొదట్నించి గుర్రుగా ఉండే అతను తాజాగా ఓపెన్ సవాలును విసిరాడు. ఉక్రెయిన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పుతిన్ తో పోరాడేందుకు తాను సిద్ధమంటూ ఛాలెంజ్ విసిరాడు.

తాను చేసిన ఈ సంచలన వ్యాఖ్యకు సంబంధించిన ట్వీట్ ను అలా వదిలేయకుండా.. రష్యా అధ్యక్ష భవనాన్ని ట్యాగ్ చేయటం ద్వారా.. మిగిలిన వారందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. దేశాలకు దేశాలే పుతిన్ తీరుపై నోరు మూసుకొని ఉన్న వేళలో.. అందుకు భిన్నంగా ఎలన్ మాస్క్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడుసరికొత్తగా మారాయి.

తనతో పోరాడేందుకు పుతిన్ కు సవాలు విసురుతున్నానంటూ పుతిన్ కు ఎలన్ మస్క్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ యుద్ధంలో గెలిచిన వారే ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం జరగాలా? లేదా? అన్నది డిసైడ్ చేయాలన్న మాట చెప్పటం చూస్తే.. ప్రపంచంలో ఎలన్ తప్పించి మరెవరూ అలాంటి వ్యాఖ్యలు చేయలేరని చెప్పాలి.

రష్యా తీరును గర్హిస్తూ ఇప్పటికే పుతిన్ కు తనదైన షాకిచ్చారు. యుద్దం కారణంగా ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో.. దానికి ప్రత్యామ్నాయంగా స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల్ని అందిస్తున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఉక్రెయిన్లకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండే సాంకేతికతను సిద్దం చేసిన ఎలన్.. ఇప్పుడు యుద్దం విషయంలో పుతిన్ కు విసిరిన సవాలుకు ఆయన ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.