కుబేరుల కొట్లాట ఇప్పుడు పర్సనల్ గా టార్గెట్ చేసుకునే వరకు వెళ్లింది

Sun May 29 2022 06:00:01 GMT+0530 (IST)

elon musk and bill gates fight

మీడియా అధిపత్యం పోయి సోషల్ మీడియా చెలరేగిపోతుందన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ.. మీడియాలో వచ్చే కథనాలకు ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గలేదన్న విషయం అప్పుడప్పుడు స్పష్టమవుతూ ఉంటుంది. తాజాగా అలాంటిదే మరొకటి వెలుగు చూసింది.ఒక వార్తా కథనం ప్రపంచంలో అపర కుబేరులుగా పేరున్న ఇద్దరు ప్రముఖుల మధ్య గొడవకు కారణం కావటమే కాదు.. వారిద్దరు ఓపెన్ గా తిట్టుకునే వరకు వెళ్లింది. ఇంతకీ ఆ ఇద్దరు ప్రముఖులు మరెవరో కాదు ఒకరు టెస్లా కార్ల అధినేత ఎలాన్ మస్క్ అయితే.. మరొకరు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.

ఇంతకూ ఈ ఇద్దరిమధ్య అంతటి రచ్చకు కారణమైన వార్తా కథనంలో ఏముందన్న విషయంలోకి వెళితే.. ట్విటర్ ను ఎలాన్ మస్క్ 4400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉండటం.. దానికి సంబంధించి డీల్ మీద ప్రపంచ వ్యాప్తంగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఈ డీల్ ను వ్యతిరేకిస్తూ ట్విటర్ కు పలు యాడ్ సంస్థలు లేఖలు రాశాయి. వాటిల్లో 11 సంస్థలకు గేట్స్ ఫౌండేషన్ నిధులు అందించిందంటూ బ్రిట్ బార్ట్ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని రాసింది.

ఇలా మొదలైన గొడవకు ఎలాన్ మస్క్ ఆగ్రహం మరింత రచ్చకు తెర తీసింది. ఈ కథనంపై మస్క్ ను కొందరు ట్విటర్ లో ప్రశ్నించగా.. అదో పనికిమాలిన చర్యగా తిట్టిపోశారు. అంతేకాదు టెస్లాలో షార్ట్ పొజిషన్లు అధికంగా తీసుకుంటున్నారని దుయ్యబడుతూ.. మరో అతి చర్యకు ఆయన తెర తీశారు. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు షార్ట్ పొజిషన్లు అంటే.. షేర్ మార్కెట్లో ఏదైనా కంపెనీ షేర్ ధర పడిపోతుందన్న అంంచనాతో తీసుకునే పొజిషన్లను ఇలా అభివర్ణిస్తారు.

గేట్స్ మీద తన అగ్రహాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఎలాన్ మస్క్.. ఆయన్ను గర్భిణితో పోలుస్తూ.. ‘‘షార్ట్ పొజిషన్లపై గేట్స్ ను నిలదీశా. శీతోష్ణస్థితి మార్పులపై మా సంస్థ ఎంతో పోరాటం చేస్తోంది. అలాంటి కంపెనీలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న గేట్స్ దాతృత్వాన్ని పర్యావరణంపై పోరును నేనైతే సీరియస్‌గా తీసుకోలేను’ అంటూ తీవ్రంగామండి పడ్డారు.
ఇలాంటివేళ.. బిల్ గేట్స్ స్పందించారు.

మస్క్ ట్వీట్లను తాను పట్టించుకోనని బదులిచ్చారు. గతంలో ఎలాన్ మస్క్ బిట్స్ కాయిన్ లో వాటా కొన్నప్పుడు.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పుడు నెగిటివ్ గా స్పందించారు. ఇలా వీరిద్దరి విభేదాలు ఇప్పుడు పెరిగిపోవటం.. గేట్స్ పై మస్క్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో వాతావరణం హాట్ హాట్ గా మారిపోతోంది. వీరిద్దరి రచ్చ ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.