Begin typing your search above and press return to search.

తాగి వాహనం నడిపితే విదేశీ విద్యకు దూరమే..

By:  Tupaki Desk   |   13 May 2016 10:35 AM GMT
తాగి వాహనం నడిపితే విదేశీ విద్యకు దూరమే..
X
పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులు.. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్ పోలీసులు ఝలక్ ఇవ్వనున్నారు. హైదరబాద్ రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ నిబంధనలు అతిక్రమించినా, తాగి వాహనం నడిపినా ఇకపై విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనుంది. అది మీ ఉద్యోగావకాశాలను - విదేశీ విద్యకు ఎసరు తెచ్చే ప్రమాదముంది. హైదరాబాద్ పోలీసులు తీసుకొస్తున్న ఓ కొత్త రూలు ఇప్పుడు నిబంధనలు అతిక్రమించే, తాగి వాహనాలు నడిపే విద్యార్థులకు షాకివ్వనుంది.

ఇటీవల కాలంలో రహదారి నిబంధనల ఉల్లంఘనలు - డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడుతున్నవారిలో విద్యార్థులు, ఉద్యోగార్థులే ఎక్కువగా ఉంటున్నారట. వారికి కళ్లెం వేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి నిబంధనలతో వస్తున్నారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి, వివరాలు సేకరించడానికి ఓ స్పెషల్ బ్రాంచ్‌ ను కూడా ఏర్పాటుచేశారు. హైదరాబాద్ లో 2011 నుంచి ఇప్పటివరకూ దాదాపు 62వేల డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా అందులో 30 వేల 78కేసులు 18 నుంచి 30 ఏళ్ల వయస్సులోపు వారిపై ఉన్నవేనట. వారిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారట. దీంతో ఇలాంటివారిని కట్టడి చేయడానికి కొరడా తీస్తున్నారు.

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి వీసా రద్దు చేయడం, ఇవ్వకుండా చేయడం వంటివి చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే అప్లికేషన్ రిజక్టయ్యేలా చేస్తారు. ఇలాంటి నిబంధనను రూపొందించి దాన్ని త్వరలో ప్రభుత్వం ముందు ఆమోదం కోసం పెట్టబోతున్నారు. సో... బంగారు భవిష్యత్తు కోరుకుంటున్న కుర్రాళ్లూ ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.