Begin typing your search above and press return to search.

విద్యుత్ సవరణ బిల్లు.. ప్రజలపై 500 శాతం చార్జీల పిడుగు!

By:  Tupaki Desk   |   7 Dec 2021 9:30 AM GMT
విద్యుత్ సవరణ బిల్లు.. ప్రజలపై 500 శాతం చార్జీల పిడుగు!
X
కేంద్ర విద్యతు చట్టంతో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. డ్యామ్ సేఫ్టీ బిల్లు ద్వారా డ్యాములను, పోర్టుల సవరణ బిల్లు ద్వారా చిన్న పోర్టులను, జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు ద్వారా వైద్య విద్యను, ట్రాన్స్ పోర్టు బిల్లు ద్వారా రవాణా రంగాన్ని, నూతన విద్యా విధానం ద్వారా విద్యా రంగాన్ని కేంద్రం గుప్పిట పట్టింది.

అయితే, ఒక్క వ్యవసాయ చట్టాల విషయంలోనే దాని ప్రయత్నం చెడింది. అన్నదాతల అద్వితీయ పోరాటంతో కేంద్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కానీ, కేంద్ర విద్యుత్ చట్టంతో మాత్రం విద్యుత్ రంగం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే.. రాష్ట్రాల స్థాయిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లు ఏమీ ఉండవు.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు

కొ్త్త విద్యుత్ చట్టంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు పలు ముసాయిదాలు వచ్చాయి. ప్రకటనలు వచ్చాయి. వీటి ఆధారంగా సవరణలు ఉండవచ్చు. దీన్నిబట్టి ముసాయిదాలో ఎలాంటి మార్పులు ఉంటాయో చెప్పలేం. అయితే, డ్రాఫ్ట్ లు , ప్రకటనల ఆధారంగా చూస్తే కేంద్రం విద్యుత్ పై పూర్తిస్థాయి పెత్తనం సాగించనుందని తెలుస్తోంది. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీ తీసుకురానుంది. ఇదే అన్ని అధికారాలను కలిగి ఉంటుంది. దీన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

రాష్ట్రాల అధికారాలకు కత్తెర???

అధికారాలన్నీ కేంద్రానికి వెళ్లిపోయి.. నిమిత్తమాత్రంగా మారిపోయే నేపథ్యంలో కొత్త విద్యుత్ చట్టంపై రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల వారీగా అక్కడి పార్టీలు విద్యుత్ ప్రణాళికలను, రాయితీలు, విధానాలను నిర్ణయించుకుంటాయి. స్థానిక అవసరాలకు తగ్గట్లు పథకాలు ప్రకటిస్తుంటాయి.

ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో విద్యుత్ అంశం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. 2000 సంవత్సరంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన ఎంతటి చర్చనీయాంశమైందో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.

వైఎస్ హామీని నాడు అధికారంలో ఉన్నటీడీపీ ప్రభుత్వం తప్పుబట్టినా.. తాము అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేసి చూపి వైఎస్ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇక ఇదే హామీని ఇప్పుడు అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రణాళికల్లో దానిని భాగం చేశాయి. అంతేకాక.. పలు వర్గాల వారికి ఇచ్చే రాయితీల్లో ప్రధానంగా కనిపించేంది విద్యుత్ రాయితీనే.

వినియోగదారులపై భారం ఇందుకే

కొత్త విద్యుత్ చట్టంలో పవరంతా కేంద్రం చేతుల్లోకి వెళ్లే క్రమంలో కాస్ట్ టు సర్వ్.. ప్రజల నెత్తిన విద్యుత్ భారం మోపనున్నది. క్రాస్ సబ్సిడీలు ఎత్తిపోయి ఉత్పత్తి ఖర్చును వినియోగదారు నుంచి గుంజే ప్రక్రియ. ఇక్కడ కాస్ట్ టు సర్వీస్ లో ఒక మెలిక కూడా ఉంది.

చెల్లించగలిగే వారి నుంచి అధికంగా వసూలు చేసి చెల్లించలేని వారికి ఉచితంగానో, రాయితీ పైనో ఇస్తారు. అంటే వ్యవసాయానికి విద్యుత్ వాయింపు తప్పదు. అయితే, ఇళ్ల వినియోగదారులకు, సగటు గ్రామీణ వినియోగదారులకు 500 శాతం విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం ఉంది.

నమ్మి తీరాల్సిందే

వామ్మో విద్యుత్ చార్జీలు 500శాతం పెరుగుతాయా? నమ్మవచ్చా? అంటే.. నమ్మాలి. 2002లో వాజ్ పేయి హయాంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పడు పెట్రో ధరల డీ కంట్రోల్ అంటే ఏమో అనుకున్నారు.

కానీ, ఇప్పుడేం జరుగుతోందో చూస్తున్నాం. 2014లో పెట్రోల్ లీటరు 63 రూపాయిలు. ప్రపంచ చమురు మార్కెట్ లో ధర బ్యారెల్ వంద డాలర్లు. నేడు బ్యారెల్ 75 డాలర్లుంటే.. పెట్రోల్ ధర 110. గ్యాస్ సిలిండర్ ధర ఎలా పెరిగిందో కూడా చూస్తున్నాం. దీన్నిబట్టి విద్యుత్ చార్జీలు పెరుగుతాయో లేదో అనేది తెలిసిపోతోంది.

రైతాంగంపై 2 లక్షల కోట్ల భారం

క్రాస్ సబ్సిడీ ఎత్తివేతతో రైతాంగంపై పడే భారం రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల కోట్ల భారం ఉంటుందని అంచనా. నమ్మశక్యం కాకున్నా అనుభవంలోకి వచ్చేది ఇదేనని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సబ్సిడీ గతంలో ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఓ ఉదాహరణగా పరిశీలించాలని సూచిస్తున్నారు. రూ.300 ఉన్న సబ్బిడీ రూ.40 కి పడిపోయిందని ప్రస్తావించారు.

నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విధానం కూడా ప్రవేశపెడుతుండడంతో రైతులు బిల్లులు కట్టకుంటే విద్యుత్ కోత విధించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. క్యాష్ అండ్ క్యారీ విధానంలోకి విద్యుత్ రంగం వెళ్లిపోయినందునే ఈ పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.