Begin typing your search above and press return to search.

ఏపీలో వచ్చే ఎన్నికలు ఈ మూడు పార్టీలకు కీలకమేనా?

By:  Tupaki Desk   |   19 Jun 2022 12:30 AM GMT
ఏపీలో వచ్చే ఎన్నికలు ఈ మూడు పార్టీలకు కీలకమేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో 2024లో జరగబోయే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేనలకు కీలకమేనా? ఏ ఒక్క పార్టీ గెలవకపోయినా .. ఆ పార్టీలు, అధినేతలకు తీవ్ర ఇబ్బందులు తప్పవా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే మూడు పార్టీలకు ఉండే ఇబ్బందులేమిటో చెబుతున్నారు. విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం..

వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ వైఎస్సార్సీపీ గెలిచి అధికారంలోకి వస్తే జగన్ టీడీపీని లేకుండా చేస్తారని అంటున్నారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గంలో కీలక నేతలందరిపైన కేసులు నమోదు చేయించడం, లేదా అరెస్టు చేయించడం, వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం వంటి పనులు జగన్ చేశారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలపై వివిధ కేసులు పెట్టి.. సీఐడీ విచారణలంటూ వారిని వేధిస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ కనుమరుగవడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు.

మరోవైపు వైఎస్సార్సీపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకూడదని కోరుకుంటోందని అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. వచ్చిన రోజు నుంచే వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకోవడం ఖాయమని చెబుతున్నారు.

ఇప్పుడు తాము ఎలా అయితే టీడీపీని వేధించామో.. అదే స్థాయిలో టీడీపీ అధికారంలోకి వస్తే తమను లక్ష్యంగా చేసుకుంటుందని వైఎస్సార్సీపీ ఆలోచనగా ఉందని పేర్కొంటున్నారు. తాము టీడీపీ నేతలను అరెస్టు చేయించి జైలుకు పంపినట్టే టీడీపీ అధికారంలోకి వస్తే తమకు అదే గతి పడుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోందని వివరిస్తున్నారు.

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కూడా వచ్చే ఎన్నికలే కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. 2019లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), వామపక్షాలతో కలిసి పోటీ చేసి జనసేన సాధించింది.. ఒకే ఒక్క సీటు. స్వయంగా పవన్ కల్యాణ్ రెండుచోట్ల బరిలో నిలిచి రెండుచోట్లా ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. పార్టీ పెట్టి ఇప్పటికే ఎనిమిదేళ్లు దాటిపోయిందని.. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేకపోతే జనసేన పార్టీ కథ కూడా ముగియడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

అధికారంలోకి రాకుండా ఒక పార్టీని ఏళ్ల తరబడి నడపడం అంటే మూమూలు కాదని చెబుతున్నారు. జనసేన లాంటి ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో రాకుండా ఎక్కువకాలం రాజకీయాలు చేయలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అటు జనసేనకు, ఇటు వైఎస్సార్సీపీకి, మరోవైపు టీడీపీకి జీవన్మరణ సమస్యేనని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.