Begin typing your search above and press return to search.

తండ్రీ కొడుకులకు కాకుండా పోయిన ‘సైకిల్’

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:09 PM IST
తండ్రీ కొడుకులకు కాకుండా పోయిన ‘సైకిల్’
X
అనుకున్నదే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా.. తండ్రీ కొడుకుల మధ్య నడుస్తున్న యూపీ రాజకీయంలో ఇద్దరికి షాకిచ్చే నిర్ణయాన్ని ఈసీ తీసుకుందన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కుటుంబ కలహంగా మొదలైన సమాజ్ వాదీ ఇంటి పంచాయితీ ఇప్పుడు బాగా ముదిరిపోయి.. పార్టీని రెండు ముక్కలుగా చీల్చటానికి అవసరమైన గ్రౌండ్ ను ములాయం.. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సిద్ధం చేసిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ ఇద్దరికి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

సమాజ్ వాదీ పార్టీని తమకు నచ్చినట్లుగా.. తోచినట్లుగా చీల్చుకునేందుకురంగం సిద్ధం చేసుకున్న ములాయం.. అఖిలేశ్ లు.. పార్టీకి ప్రాణమైన పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘‘సైకిల్’’ మీద ఫోకస్ చేశారు. సమాజ్ వాదీపార్టీ తమదంటే తమదంటూ తమ తమ వాదనల్ని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద వినిపించుకున్నారు.

వారి వాదనల్ని విన్న కేంద్ర ఎన్నికల సంఘం.. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘‘సైకిల్’’ను ఇద్దరు అధినేతలకు ఇవ్వకూడదని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ వారంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు జోరుగా అందుతున్నవేళ.. చోటు చేసుకున్న పరిణామాలపై ఈసీ తనదైన శైలిలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.

సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు సైకిల్ ను తండ్రీ కొడుకులు ఇద్దరికి ఇవ్వకుండా.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ ఇద్దరికి వేర్వేరుగా కొత్త గుర్తుల్ని ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఈ సమాచారం కానీ నిజమైతే.. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. కమలనాథులకు పండగేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/