Begin typing your search above and press return to search.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ఉండేది ఇలానా?

By:  Tupaki Desk   |   24 Jan 2019 5:16 AM GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ ఉండేది ఇలానా?
X
ఎన్నిక‌ల గంట మోగింది. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసి.. ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. షెడ్యూల్ లో భాగంగా ఈ జూన్ నాటికి కొత్త ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు ఎన్నుకోవాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న 543 లోక్ స‌భ స్థానాల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు వీలుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. నాలుగు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో విడుద‌ల చేస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ‌తోనూ ఎన్నిక‌ల స‌న్న‌ద్ద‌త‌కు సంబంధించిన లాంఛ‌నాల్ని పూర్తి చేసిన ఈసీ.. ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు స‌మాయుత్తం అవుతోంది. అదే జ‌రిగితే.. ఎన్నిక‌ల కోడ్ షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచి వ‌చ్చిన‌ట్లే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ భారీగా ఉంటుంది. ఐదు ద‌శ‌ల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల త‌తంగాన్ని పూర్తి చేయాల‌ని భావిస్తోంది. గ‌తంలో మాదిరి సుదీర్ఘ‌కాలం ఎన్నిక‌ల షెడ్యూల్ న‌డ‌వ‌కుండా కేవ‌లం నెల వ్య‌వ‌ధిలోనే మొత్తం ప్ర‌క్రియ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ఒక‌వేళ వీలుకాని ప‌క్షంలో 55 రోజుల్లో మొత్తం ప్ర‌క్రియ పూర్తి అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. సిక్కిం.. ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌నున్నారు. ఎంత పెద్ద రాష్ట్రమైనా క‌నిష్ఠంగా రెండు.. గ‌రిష్ఠంగా మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ఈసీ భావిస్తోంది. గ‌త ఎన్నికల స‌మ‌యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్.. బీహార్ ల‌లో ఐదు నుంచి ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించారు. ఈసారి అలా కాకుండా వీలైనంత త‌క్కువ దశ‌ల్లో ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ రెండో వారంలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ రెండో వారంలో పోలింగ్ జ‌రిగే వీలుంది. ద‌క్షినాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌ల్ని ఒకే ద‌శ‌లో పూర్తి చేయ‌నున్నారు. రెండో ద‌శ‌లో తెలంగాణ‌.. త‌మిళ‌నాడు - మూడో ద‌శ‌లో ఏపీతో పాటు క‌ర్ణాట‌క‌.. కేర‌ళ రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్ని పూర్తి చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.