Begin typing your search above and press return to search.

జగన్ ఎఫెక్ట్.. ఏపీ డీజీపీ మార్పు.?

By:  Tupaki Desk   |   6 March 2019 7:15 AM GMT
జగన్ ఎఫెక్ట్.. ఏపీ డీజీపీ మార్పు.?
X
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఒక్కొక్కటిగా సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సందర్భంగా అధికారుల మార్పులు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.. అయితే ఇన్నిరోజుల ముందే ఏపీ రాష్ట్ర డీజీపీని కొంతకాలం పక్కనబెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర డీజీపీపై ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే లోపే ఆయనను ఎన్నికలయ్యే వరకు తప్పించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

గత అక్టోబర్‌ లో విశాఖ ఏయిర్‌ పోర్టులో శ్రీనివాస్‌ అనే వ్యక్తి వైసీపీ అధినేత జగన్‌ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్‌ భుజానికి గాయమైంది. ఈ సమయంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని జగన్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ఠాకూర్‌ను మార్చాలని జగన్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వానికి డీజీపీ అనుకూలంగా వ్యహవరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఏపీ నిఘా విభాగం వెంకటేశ్వర్‌ రావు - -కోఆర్డినేషన్‌ అధికారి శ్రీనివాస్‌ లను కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని అభ్యర్థించారు.

దీంతో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని నియించాలని ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఒకవేళ ఎన్నికల సంఘం ఠాకూర్‌ను పక్కనబెడితే... ఆయన ప్లేసులో గతంలో విజయవాడ కమిషనర్‌ గా పనిచేసిన గౌతం సవాంగ్‌ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు గౌతం సవాంగ్‌ ఇన్‌ చార్జి డీజీపీగా సేవలు అందించే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయిన తరువాత ఠాకూర్‌ ను మళ్లీ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

వైఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఐపీఎస్ అధికారి రామవతార్‌ యాదవ్‌ పై ఇలాగే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం ఆయనను తప్పించాలని ప్రభుత్వానికి సూచించగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి డీజీపీగా మహంతికి అవకాశం ఇచ్చారు. ఎన్నికలు పూర్తయిన తరువాత 2009లో వైఎస్‌ అధికారంలోకి రాగానే మళ్లీ రామవతార్‌ యాదవ్‌ కు బాధ్యతలు అప్పగించారు.