Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ సర్కార్ ... ఏ విషయంలో అంటే ?

By:  Tupaki Desk   |   1 Dec 2020 11:30 AM GMT
నిమ్మగడ్డకు షాకిచ్చిన ఏపీ సర్కార్ ... ఏ విషయంలో అంటే ?
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ,,, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరోసారి షాక్ ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో లోకల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ దాఖలు చేశారు. కమిషనర్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా , ఏక పక్షంగా ప్రకటన చేశారని ప్రభుత్వం పిటీషన్ లో కోర్టుకు తెలియజేసింది. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు.

అలాగే , సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషనర్ ప్రకటన ఉందని ప్రభుత్వం పిటీషన్ లో పొందుపరిచింది. గతంలో కరోనా కారణంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్, మళ్లీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వం భాద్యత అని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కారణంగా దాదాపు 6 వేల మంది చనిపోయిన విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలని వాయిదా వేయాలని ఆదేశాలివ్వాలని ప్రభుత్వం హై కోర్టును కోరింది. అయితే , ప్రభుత్వ పిటీషన్ పై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్న అంశం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత ను రేకెత్తిస్తుంది. అలాగే ప్రభుత్వం వేసిన ఈ పిటీషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.