Begin typing your search above and press return to search.

ఫ‌లితాలు వ‌చ్చేస‌రికి రాత్రి ఖాయం!

By:  Tupaki Desk   |   9 May 2019 4:29 AM GMT
ఫ‌లితాలు వ‌చ్చేస‌రికి రాత్రి ఖాయం!
X
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మే 23 తేదీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తోంది. దేశ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈవీఎంల ఎంట్రీ త‌ర్వాత ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంట‌ల మ‌ధ్య‌లో పూర్తిస్థాయిలో వ‌చ్చేస్తున్న ప‌రిస్థితి. అయితే..ఈసారి అలాంటి ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెబుతున్నారు.

మారిన నిబంధ‌న‌ల నేప‌థ్యంలో తుది ఫ‌లితం వెలువ‌డ‌టం ఆల‌స్యం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. గతంతో పోలిస్తే.. ఐదారు గంట‌ల స‌మ‌యం ఎక్కువ‌గా ప‌ట్టే వీలుంద‌ని.. అప్ప‌టివ‌ర‌కూ వీవీ ప్యాట్ చిట్టీల‌ను లెక్కించాల్సి ఉండ‌ట‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు.

బ్యాలెట్ ప‌త్రాల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించిన స‌మ‌యంలో అర్థ‌రాత్రి.. ప‌క్క‌రోజుకు కానీ ఫ‌లితాల మీద క్లారిటీ వ‌చ్చేది కాదు. కానీ.. ఎప్పుడైతే ఈవీఎంలు ఎంట్రీ ఇచ్చాయో అప్ప‌టి నుంచి ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చేసింది. మ‌హా అయితే.. ఉద‌యం 10-11 గంట‌ల వేళ‌కే గెలుపు ఎవ‌రిది? ఓట‌మి ఎవ‌రిది? అన్న స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఒక్క క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితం మాత్ర‌మే తేడా కొట్టింది.

ఈ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓట్ల లెక్కింపులో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత వెల్ల‌డైన ఫ‌లితాలు.. మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల వ‌ర‌కూ బీజేపీనే అధిక్య‌తలో ఉండ‌టంతో పాటు.. అధికారం కూడా ఆ పార్టీదే అన్న భావ‌న క‌లిగింది. అయితే.. మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌కు ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ఫ‌లితాలు తారుమారు కావ‌ట‌మేకాదు.. నువ్వానేనా? అన్న‌ట్లు సాగి.. బీజేపీ కంటే కాంగ్రెస్ కాసిన్ని సీట్లు ఎక్కువ‌గా రావ‌టం.. ఆ పార్టీ జేడీఎస్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో జేడీఎస్ స‌ర్కార్ కొలువు తీరిన సంగ‌తి తెలిసిందే.

ఇదొక్క ఫ‌లితం మిన‌హా.. మిగిలిన అన్ని సంద‌ర్భాల్లో తొలుత అధిక్య‌త‌లో ఉన్న పార్టీనే విజ‌యాన్నిసొంతం చేసుకుంది. ఇద‌లా ఉంటే.. తాజా సార్వ‌త్రిక‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల సంద‌ర్భంగా వీవీ ప్యాట్ల లో న‌మోదైన స్లిప్పులు.. పోలైన ఓట్లు స‌రిపోవాలి. లేనిప‌క్షంలో.. ఫ‌లితం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన ఫ‌లితాల‌కు భిన్నంగా.. రాత్రి వేళ‌కు కానీ పూర్తిస్థాయిలో ఫ‌లితాలు వెల్ల‌డి కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు.