Begin typing your search above and press return to search.

జ‌మిలీ ఎన్నిక‌లు..ఇంకో కీల‌క అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   11 Aug 2018 8:03 AM GMT
జ‌మిలీ ఎన్నిక‌లు..ఇంకో కీల‌క అప్‌ డేట్‌
X
ఒక‌డుగు ముందుకు..రెండు అడుగుల వెన‌క్కు అన్న‌ట్లుగా సాగుతున్న జమిలి ఎన్నికల ప్ర‌క్రియ‌లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.దాదాపు నెల‌రోజుల కిందట జమిలి ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలతో న్యాయ కమిషన్ రెండు రోజులు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జమిలి ప్రతిపాదనకు నాలుగు పార్టీలు మద్దతు తెలుపగా తొమ్మిది రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి. సంప్రదింపులకు అధికార బీజేపీ - ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. దీంతో అప్ప‌టివ‌ర‌కు పెద్ద ఎత్తున సాగిన ఈ చ‌ర్చ మూల‌న ప‌డింది. అయితే, తాజాగా మ‌రో కీల‌క ప‌రిణామంతో ఈ ఎన్నిక‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. జ‌మిలీ ఎన్నిక‌ల‌కు బదులు ఏడాదికి ఒక ఎన్నిక నిర్వహించడం మంచి ప్రత్యామ్నాయం అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలో బీజేపీ స‌ర్కారు జ‌మిలీ ఎన్నిక‌ల‌వైపు దూకుడుగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ కేంద్రంగానే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారులు ప‌ర్య‌టించి జ‌మిలీ సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించారు. దీనికి కొన‌సాగిపుగా న్యాయ క‌మిష‌న్ సైతం ఆయా పార్టీలతో స‌మావేశం అయింది. జమిలి ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అనుకూలమని న్యాయ కమిషన్‌కు తెలిపింది. ఎస్పీ తరఫున సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ 2019 నుంచి ఒక దేశం, ఒకే ఎన్నిక ప్రక్రియకు అంకురార్పణ జరుగాలని పేర్కొన్నారు. కాగా, జమిలి ఎన్నికలు ఆచరణ యోగ్యం కాదని, వాంఛనీయం కాదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన పూర్తిగా సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తుందని న్యాయ కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. డీఎంకే సీనియర్ నేత తిరుచ్చి శివ సమావేశానికి హాజరై పార్టీ రాసిన లేఖను అందజేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయ కమిషన్ ప్రతిపాదనను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తిరస్కరించింది. ఈ ప్రతిపాదన సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వహణ ప్రజాస్వామ్య వ్యవస్థగా మార్చివేస్తుందని సమావేశం తర్వాత మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి - ఎంపీ విజయ సాయిరెడ్డి - ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. లా కమిషన్ చైర్మన్‌ కు లేఖ అందజేశారు. తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ ఓకే చెప్ప‌గా..ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నో చెప్పింది.

ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ త‌మ అభిప్రాయాలు వినిపించిన క్ర‌మంలో తాజాగా ఒక ఆంగ్ల టీవీ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు భారీగా సిబ్బందిని నియమించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. అందుకే ఏడాదికో ఎన్నిక నిర్వ‌హించ‌డం స‌రైన ప్ర‌త్యామ్నాయంగా తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు.