Begin typing your search above and press return to search.

ఎలక్షన్ కమీషన్-టీడీపీ ఏకమయ్యాయా ? 28 పైనే అందరి చూపు

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:00 AM IST
ఎలక్షన్ కమీషన్-టీడీపీ ఏకమయ్యాయా ? 28 పైనే అందరి చూపు
X
రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా నడుచుకోవటం అందరు చూస్తుంటారు. కానీ ఏపిలో మాత్రం ఎలక్షన్ కమీషన్ మాత్రం ప్రతిపక్షాలు చెప్పినట్లుగా నడుచుకుంటోందా ? అనే అనుమానం వస్తోంది అందరికీ. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయం ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. రోజుకు సగటున 4 వేల కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో వాయిదా పడిన స్ధానిక సంస్ధలను నిర్వహించటానికి ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడీ అయిపోయారు. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ ఎప్పుడైతే రెడీ అయిపోయారో వెంటనే తెలుగుదేశంపార్టీ కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ ఆయనకు మద్దతుగా నిలబడింది.

మొన్నటి మార్చిలో అయిపోవాల్సిన ఎన్నికలను చివరి నిముషంలో కరోనా వైరస్ ను సాకుగా చూపించి నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదా వేశారు. నిజానికి అప్పుడు రాష్ట్రం మొత్తం మీద నెల్లూరులో ఒకే ఒక్క కేసు మాత్రమే నమోదయ్యుంది. ఓ నాలుగురోజులు ఓపికపట్టుంటే ఎన్నికలు పూర్తియిపోయేవే. కానీ నిమ్మగడ్డ అందుకు ఒప్పుకోలేదు. ఇదే విషయం అప్పట్లో అధికార పార్టీ వైసీపీ చెప్పినా నిమ్మగడ్డ అంగీకరించలేదు. అప్పుడు టీడీపీ నిమ్మగడ్డకు మద్దతుగా మాట్లాడింది.

వేలాదిమంది ప్రాణాలను రక్షించటం కోసమే నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. సరే ఆ తర్వాత జరిగిన వివాదమంతా అందరికీ తెలిసిందే. తాజాగా హైకోర్టులో ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం చెప్పింది. అయితే నిమ్మగడ్డ మాత్రం ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు తాము రెడీగా ఉన్నట్లు ఎన్నికల కమీషన్ స్పష్టంగా చెప్పేసింది. వెంటనే టీడీపీ నిమ్మగడ్డకు మద్దతుగా రంగంలోకి దిగేసింది.

ఎన్నికలను నిర్వహించటానికి ప్రభుత్వం భయపడుతోందంటూ చంద్రబాబు, కొత్తగా అద్యక్షుడుగా అపాయింట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడు మండిపోయారు. ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాగ్రహానికి గురికవాల్సొస్తుందనే భయంతోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనకాడుతోందంటూ మండిపోయారు. అంటే ఎన్నికలను నిర్వహించాలన్న నిమ్మగడ్డ ఆలోచనకు చంద్రబాబు మద్దతుగా నిలిచిందన్న విషయం అర్ధమైపోతోంది. పైగా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవద్దని నిమ్మగడ్డకు సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

అయినా నిమ్మగడ్డ లెక్క చేయకుండా ఇపుడు కూగా ఏకపక్షంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఎన్నికల నిర్వహణపై ఈనెల 28వ తేదీన రాజకీయపార్టీలతో సమావేశం ఏర్పాటుచేశారు నిమ్మగడ్డ. సమావేశం సందర్భంగా కానీ తర్వాత కానీ మళ్ళీ నిమ్మగడ్డకు ప్రభుత్వానికి ఘర్షణ మొదలవ్వటం ఖాయంగానే అనిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ, టీడీపీ ఏకమైనట్లే అర్ధమైపోతోంది. చూద్దాం 28వ తేదీన ఏమి జరుగుతుందో.