Begin typing your search above and press return to search.

వైరస్ ఎఫెక్ట్: ఉప ఎన్నికలన్నీ వాయిదా

By:  Tupaki Desk   |   23 July 2020 12:10 PM GMT
వైరస్ ఎఫెక్ట్: ఉప ఎన్నికలన్నీ వాయిదా
X
వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో వైరస్ వ్యాప్తితోపాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలను సెప్టెంబర్ 7వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. అయితే పరిస్థితులు మెరుగుపడితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

మధ్యప్రదేశ్‌తోపాటు, అసోం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ఈ ఏడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్ లో 22 అసెంబ్లీ స్థానొలు ఖాళీ అయ్యాయి. వాటన్నింటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన సమయంలో ఈ వైరస్ వ్యాపించడంతో ఆయా స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా నిష్క్రమించిన తరువాత 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10వ తేదీన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. అనంతరం వారంతా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆ స్థానాలకు ఉప ఎన్నికలను సెప్టెంబర్ 10వ తేదీలోపు నిర్వహించాల్సి ఉంటుంది.

వైరస్ వ్యాప్తి కారణంగా ఆ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు గతంలో వాయిదా పడ్డాయి. వాటికి మధ్యప్రదేశ్ స్థానాలు తోడయ్యాయి. వీటన్నిటికీ వైరస్‌ ఉధృతి తగ్గిన తర్వాత ఉప ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి.