Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కి షాక్ ఇచ్చిన ఈసీ..ఏమైందంటే?

By:  Tupaki Desk   |   14 March 2020 4:18 PM IST
సీఎం జగన్ కి షాక్ ఇచ్చిన ఈసీ..ఏమైందంటే?
X
ఏపీ ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉగాది పండుగ నాడు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్నికల కమీషన్ అభ్యంతరం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీని వెంటనే నిలిపివేయాలని.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌ కుమార్ ఆదేశించారు. ఎన్నికల నియామావళి అమలులో ఉందని, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టొద్దని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

ప్రతి జిల్లా అధికారులు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని - పట్టాల పంపిణీకి సంబంధించి టెండర్లు పిలవడం - టోకెన్ల పంపిణీ వంటివి చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అమలు చేయడానికి వీలు లేదని తేల్చేసారు. దీనితో మార్చి 25న చేపట్టాలని ముందు నిర్ణయించిన ఈ కార్యక్రమం వాయిదా పడినట్లయింది. ముందుగా ఉగాది రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు.

కానీ, ఈ మధ్యలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. దీంతో స్థలాల పంపిణీపై సందిగ్థత కొనసాగింది. అయితే , దానిపై వివరణ ఇచ్చిన ఈసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇంటి స్థలాల పంపిణి కుదరదు అని తేల్చిపడేసింది. అయితే సీఎం జగన్ అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలపై యధావిధిగా సమీక్ష నిర్వహించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తెలిపారు. కాగా, పేదలకు ఇళ్ల పట్టాలను ఎప్పుడు పంపిణీ చేస్తారన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.