Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీ..టీవీల్లో వారి సినిమాలు బంద్!

By:  Tupaki Desk   |   20 March 2019 4:16 PM IST
ఎన్నికల్లో పోటీ..టీవీల్లో వారి సినిమాలు బంద్!
X
కర్ణాటకలో జరుగుతున్నది కేవలం లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు మాత్రమే అయినా.. రాజకీయ వేడి మాత్రం తీవ్రంగానే ఉంది. రాజకీయ ప్రత్యర్థులు మాటల దాడి విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తీవ్రమైన వ్యాఖ్యలను చేసుకోవడానికి కూడా వారు వెనుకాడటం లేదు. ప్రత్యేకించి ఒక సీటు రాజకీయం పతాక స్థాయికి చేరింది.

అదే మండ్య. ఈ సీటుకు గతంలో గ్లామరస్ సినిమా వాళ్లు ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కు బాగా పట్టుంది కూడా. ఆ నటుడు ఇటీవలే దివంగతులు అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే ఆమె పోటీని కన్నడ రాష్ట్రంలోని అధికార పార్టీ జేడీఎస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవడం నేరం అయినట్టుగా జేడీఎస్ విరుచుకుపడుతూ ఉంది. అయితే జేడీఎస్ వ్యాఖ్యలతో సుమలత భయపడటం లేదు. వారికి ధీటుగా సమాధానాలు ఇస్తోందామె.

పోటీ చేయడానికి వెనుకాడేది లేదని ఆమె ప్రకటించారు. ఆమె తరఫున కొందరు సినిమా వాళ్లు కూడా ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నాడు కుమారస్వామి తనయుడు - జాగ్వార్ సినిమా హీరో నిఖిల్ గౌడ. ఇలా మండ్యలో ఒక సీనియర్ నటికి - ఒక జూనియర్ హీరోకి మధ్యన పోరు జరగనుంది. ఇప్పటికే మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఒక ఆసక్తిదాయకమైన ప్రకటన చేసింది. ఎన్నికలు ముగిసేంత వరకూ సుమలత - నిఖిల్ గౌడల సినిమాలు ఏవీ దూరదర్శన్ లో ప్రసారం కావడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనే భావనతో.. వాళ్ల సినిమాలను ప్రసారం చేయొద్దని ప్రభుత్వ ఆధీనంలోని టీవీ చానల్ కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది.