Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ పంపిణీకి ఎన్నికలు అడ్డంకి కాదా ?

By:  Tupaki Desk   |   18 Dec 2020 5:30 PM GMT
వ్యాక్సిన్ పంపిణీకి ఎన్నికలు అడ్డంకి కాదా ?
X
వాయిదా వేసిన స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎలాగైనా జరిపించేందుకు స్టేట్ ఎలక్షన్ కమీషన్ హైకోర్టులో తన కౌంటర్ దాఖలు చేసింది. కరోనా వైరస్ తగ్గలేదని, పైగా కరోనా వ్యాక్సిన్ వేయించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు జరపటం సాధ్యంకాదని రాష్ట్రప్రభుత్వం కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. దానికి ఎన్నికల కమీషన్ గురువారం కౌంటర్ దాఖలు చేసింది. తన కౌంటర్లో కమీషన్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పింది.

అవేమిటంటే వ్యాక్సిన్ పంపిణీకి స్ధానిక ఎన్నికల ప్రక్రియ ఏమాత్రం అడ్డంకి కాదని. ఎలా అడ్డంకి కాదని అనుకుంటోందో అర్ధం కావటం లేదు. ఎందుకంటే ఎన్నికలను నిర్వహించాలన్నా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేయాలి. అలాగే జనాలకు కరోనా వ్యాక్సిన్ వేయించాలన్నా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేయాలి. మరలాటంపుడు ఒకవైపు ఎన్నికల నిర్వహణ మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సాధ్యం కాదుకదా. ఎన్నికల నిర్వహణకేమో ఓ గడువుంటుంది. కానీ వ్యాక్సినేషన్ కు గడువంటు ఉండదు.

ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ రావటం లేదని కమీషన్ ఎలా చెప్పగలిగింది ? డిసెంబర్ 25వ తేదీ నుండి వ్యాక్సినేషన్ కు రాష్ట్రాలు సన్నంద్ధంగా ఉండాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పిన విషయాన్ని కమీషన్ మరచిపోయిందా ? పైగా వ్యాక్సినేషన్ అన్నది ఒకసారి వేసి వదిలేసేది కాదు. రోజుల గడువుతో మూడుసార్లు వేయించాలి. బీహార్, రాజస్ధాన్, హైదరాబాద్ లో ఎన్నికలు జరిగాయని కమీషన్ చెప్పింది వాస్తవమే.

అయితే ఇదే సమయంలో గుజరాత్ లో వాయిదా వేసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు. పైగా కరోనా వైరస్ సమస్య అన్నీ రాష్ట్రాల్లోను ఒకేలాగ లేదన్నది వాస్తవం. చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని స్వయంగా ఒకపుడు కమీషనర్ నిమ్మగడ్డే చెప్పారు కదా. స్ధానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్ధితులు అనుకూలంగా ఉన్నాయని కమీషన్ చెప్పటంలో అర్ధంలేదు.

ఎందుకంటే కరోనా తీవ్రత పెరిగిందా లేకపోతే తగ్గిందా అన్న విషయాన్ని చెప్పాల్సింది వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీయే కానీ ఎన్నికల కమీషన్ కాదు. కరోనా ప్రభావం లేని సమయంలో ఏమో వైరస్ ను బూచిగా చూపించి ఎన్నికలను నిమ్మగడ్డ ఏకపక్షంగా వాయిదావేశారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నపుడేమో ఎన్నికల నిర్వహణకు పరిస్దితులు అనుకూలంగా ఉందని అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది.