Begin typing your search above and press return to search.

వైవాహిక జీవితానికి బిల్‌ గేట్స్‌ స్వస్తి ... కుమార్తె భావోద్వేగం

By:  Tupaki Desk   |   5 May 2021 12:30 PM GMT
వైవాహిక జీవితానికి బిల్‌ గేట్స్‌ స్వస్తి ... కుమార్తె భావోద్వేగం
X
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ దంపతులు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు పొందిన ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. కరోనాపై పోరాటంలోనూ వ్యాక్సినేషన్ కోసం భారీ మొత్తాన్ని ఈ సంస్థ అందజేస్తోంది. దీనిపై వారి కుమార్తె స్పందించారు.

నా తల్లిదండ్రులు విడిపోతున్నారన్న వార్త మీలో చాలా మంది వినే ఉంటారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, నా భావోద్వేగాలు ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కావడం లేదు. నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అమ్మానాన్నల విడాకులపై వ్యక్తిగతంగా నేనేమీ కామెంట్‌ చేయదలచుకోలేదు. కానీ ఈ సమయంలో మీరిచ్చే మద్దతు నాకెంతో ఊరట కలిగిస్తుంది అంటూ గేట్స్‌ దంపతుల పెద్ద కుమార్తె జెన్నిఫర్‌ గేట్స్‌ భావోద్వేగానికి గురైయ్యారు. తన తల్లిదండ్రులు ఇకపై కలిసి ఉండబోవడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఈ విషయంపై స్పందించిన జెన్నిఫర్‌ ఇన్‌స్టా వేదికగా ఈ మేరకు తన మనసులోని భావాలు పంచుకున్నారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని, తమకు అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా 1994లో బిల్‌, మిలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కూతుళ్లు జెన్నిఫర్‌ కేథరీన్‌ 25, ఫేబీ అడేల్‌ 18, కొడుకు రోనీ జాన్‌ 21 సంతానం. భార్యాభర్తలుగా విడిపోయినా స్వచ్ఛంద సంస్థ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది.. కొత్త జీవితంలో వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని ట్విటర్‌లో బిల్‌, మిలిండాలు ప్రకటించారు.