Begin typing your search above and press return to search.

అన్నల కుర్చీ తమ్ముళ్లకే...ఇదే ధర్మం...?

By:  Tupaki Desk   |   6 April 2022 9:23 AM GMT
అన్నల కుర్చీ తమ్ముళ్లకే...ఇదే ధర్మం...?
X
పదవి ఏదైనా మా కుటుంబానికే ఉండాలి. ఇదీ ఫిలాసఫీ. తమకు కాకపోతే తమ వారికీ. ఇపుడు వైసీపీలో కొందరి మంత్రుల వత్తిడి కానీ డిమాండ్ కానీ అలాగే ఉంది అంటున్నారు. సరే జగన్ చెప్పిన మాట ప్రకారం సగం పాలన తరువాత తాము తప్పుకుంటాం, కానీ తాము ఖాళీ చేసిన అమాత్య కుర్చీ తమ ఫ్యామిలీకే కట్టబెట్టాలీ. ఇదే రకమైన వత్తిడి సీనియర్ల నుంచి వస్తోందిట.

ఈ విషయంలో ఉత్తరాంధ్రా మంత్రులు నాలుగాకులు ఎక్కువ చదివారు అనే అంటున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తన తమ్ముడు, గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్న బొత్స అప్పలనరసయ్యకు ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఆ విధంగా చేసినా కుడి చేయి నుంచి ఎడమ చేయికి వెళ్ళినట్లుగా పదవి తమ ఇంట్లోనే ఉంటుందన్నది బొత్స వారి స్కెచ్ అని అంటున్నారు. దాంతో ఆయన ఈ విషయంలోనే గట్టి పట్టుదలగా ఉంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇక ఇదే రకమైన ఫార్ములాను మొరో మంత్రి కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. ఆయన తాను సీటు ఖాళీ చేస్తే తన తమ్ముడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వచ్చి కూర్చుంటాడు అని అపుడే సన్నిహితులకు చెప్పేసుకుంటున్నారుట. అంటే జగన్ అలా ఆయనకు హామీ ఇచ్చారా, లేక ప్రసాదరావుకు మంత్రి పదవి కన్ ఫర్మ్ అయిందా అన్నది తెలియడంలేదు కానీ క్రిష్ణదాస్ మాత్రం మంత్రి పదవి ఎక్కడికీ పోదు తమ కుటుంబంలోనే ఉంటుందని అంటున్నారని టాక్.

మరి జగన్ అయితే ఇలాంటి వాటి మీద ఎంతవరకూ హామీ ఇచ్చారు, ఆయన ఎంతవరకూ ఇలాంటి డిమాండ్లను పట్టించుకుంటారు అన్నది ఒక చర్చగా ఉంది. అసలు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నది కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని కదా. మరి వారి ఆశలు తీరనపుడు, ఒక కుటుంబానికే మంత్రి పదవులు వెళ్ళిపోతున్నపుడు ఇంత పెద్ద కసరత్తు చేయడం కూడా ఎందుకు అన్న ప్రశ్న వస్తోంది.

మరో వైపు ఆలోచిస్తే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట ఇలా ఇచ్చినా మరి కేవలం సింగిల్ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి అయిన వారు తమకు కాకపోతే ఎవరికి మంత్రి పదవిని కోరుతారు. అపుడు వారికి ఇలాంటి డిమాండ్లు కంటగింపుగా ఉండవా అన్న చర్చ కూడా ఉంది.

మంత్రి పదవి అంటే జగన్ ఎవరిని ఎంపిక చేసి ఇస్తారో వారికే దక్కుతుంది అని అంటున్నారు. అలా కాకుండా తమ వారికి ఇమ్మనో, తమ ఫ్యామిలీ వారికే ఇమ్మనో డిమాండ్ చేస్తే విస్తరణ యొక్క ముఖ్య లక్ష్యమే పూర్రిగా మారిపోతుంది అని కూడా అంటున్నారు. మరి కొందరి సీనియర్ నాయకుల విషయంలో వారి డిమాండ్లకు హై కమాండ్ తలొగ్గుతుందా అన్నది కూడా చూడాలి.