Begin typing your search above and press return to search.

దొందూ దొందే:మాంసం వద్దంటే గుడ్లతో దాడా?

By:  Tupaki Desk   |   14 Sep 2015 5:53 AM GMT
దొందూ దొందే:మాంసం వద్దంటే గుడ్లతో దాడా?
X
మాంసం విక్రయంపై ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మరికొన్ని దురదృష్టకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జైనుల పవిత్ర దినమైన ‘‘పర్యుషాన్’’ సందర్భాన్ని పురస్కరించుకొని పలు రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి.. మాంసం విక్రయం లాంటి సున్నిత అంశాలపై నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వాలు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా పలువురు తప్పు పడుతున్నారు. మెజార్టీ వర్గీయుల మనోభావాలు పేరిట.. ఇలాంటివి చేయటం తగదని వారు చెబుతున్నారు. ఒకవేళ మెజార్టీ వర్గీయుల్ని సంతోష పెట్టటానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. ముస్లింలు మెజార్టీగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో ఇలాంటి నిర్ణయాన్నే అక్కడి సర్కారు తీసుకోవటం సరికాదన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు.. మాంసం అమ్మకాలపై విధించిన ఆంక్షల నిర్ణయంపై బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించే శివసేన తీవ్రంగా తప్పు పడుతోంది. తాజాగా.. మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రకు చెందిన ఒక జ్యూయలరీ షాపు యజమాని ఒక పోస్టింగ్ పెట్టాడు. దీన్ని చూసిన శివసేన కార్యక్ర్తలు ఆయన దుకాణంపై గుడ్లు విసిరారు. దీంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి.

ఇలా.. ఒకవైపు ప్రభుత్వం ముందు వెనుకా చూసుకోకుండా మాంసం విక్రయంపై నిర్ణయాలు తీసుకుంటుంటే.. మరోవైపు శివసేన కార్యకర్తలు హద్దులు మీరి.. తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేయటం.. దాడికి పాల్పడటం లాంటివి చేయటం గమనార్హం. మొత్తానికి ప్రభుత్వమే కాదు.. శివసేన కూడా తనకు బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తూ పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారి తీసేలా వ్యవహరిస్తోంది. మాంసం విక్రయ వ్యవహారంలో రెండు వర్గాలు దొందూ దొందూ అన్నట్లే ప్రవర్తిస్తున్నాయి.