Begin typing your search above and press return to search.

ఉస్మానియాలో ‘కత్తి’ ఫైటింగ్

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:53 AM IST
ఉస్మానియాలో ‘కత్తి’ ఫైటింగ్
X
పవన్ కల్యాణ్ - కత్తి మహేశ్ వివాదం ఇప్పుడు అభిమానుల నుంచి విద్యార్థులకు పాకింది. ఫలితంగా హైదరాబాద్‌ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కత్తి మహేశ్ అనుకూల - వ్యతిరేక వర్గాలు పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

కత్తి మహేష్ పై నిన్న కోడిగుడ్లతో దాడి జరిగిన నేపథ్యంలో - ఈ దాడి పవన్ కల్యాణ్ అభిమానులే చేశారని ఆరోపిస్తూ - ఉస్మానియాలోని దళితవర్గం విద్యార్థి నేతలు ఈరోజు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే... యూనివర్శిటీలోని పవన్ కల్యాణ్ అభిమానులు పోటీ ఆందోళన తలపెడుతూ - తమ హీరోను విమర్శిస్తున్న కత్తి మహేష్ క్షమాపణలు కోరాల్సిందేనని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

అటు దళిత సంఘాలు - ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు ఉస్మానియాలో పోటాపోటీ ఆందోళనలకు దిగడంతో వర్శిటీ మీదుగా వెళ్లే రహదారులను పోలీసులు మూసి వేశారు. వర్శిటీలో ఎటువంటి ఆందోళనలకూ అనుమతి లేదని - నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

పవన్ ఫ్యాన్స్ పేరిట తనను కొందరు వేధింపుల పాలు చేస్తున్నారని - వారిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా కొండాపూర్ లో కారు దిగిన ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. అనంతరం ఓయూ జేఏసీ నేతలు కత్తికి మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని యూనివర్శిటీలకు సమాచారం అందించి కత్తికి అండగా ఉంటామని అంటున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరించారు. కాగా తాజా పరిణామాలతో ఈ వివాదం విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.