Begin typing your search above and press return to search.

హెచ్1బీలపై నిషేధం.. భారతీయులపై ఎంత భారం?

By:  Tupaki Desk   |   24 Jun 2020 10:50 AM GMT
హెచ్1బీలపై నిషేధం.. భారతీయులపై ఎంత భారం?
X
కరోనా-ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం.. లబ్ధి చేకూర్చడానికి తాజాగా ట్రంప్ అసాధారణ రీతిలో వీసాలన్నింటిని డిసెంబర్ వరకు రద్దు చేశారు. ఫిబ్రవరి ఏప్రిల్ మధ్యలో 1.7 కోట్ల మందికి పైగానే అమెరికన్లు రోడ్డున పడ్డారు. కీలక రంగాల్లో మరో రెండు కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ట్రంప్ వీసాలు రద్దు చేశారు. అయితే ఇది అందరికంటే భారతీయులపై పెను ప్రభావం పడుతుంది. ఎందుకంటే అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాల్లో దాదాపు 70శాతం భారతీయులే పొందుతున్నారు. అదే ఇప్పుడు ఇండియన్స్ నిపుణులకు అమెరికా కలలపై నీళ్లు చల్లుతోంది.

ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని వాషింగ్టన్ పోస్టు-మేరిల్యాండ్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ఏకంగా 65శాతం మంది ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కార్పొరేట్ కంపెనీలు, ప్రతిపక్షాలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు మాత్రం తప్పుపట్టాయి. అమెరికా ఆర్థిక బలాన్ని దెబ్బతీస్తాయని ఆరోపించారు.

భారతీయులు అమెరికా వెళ్లడానికి జనవరి వరకూ వేచి చూడాల్సిందే. కరోనా ఉధృతి కారణంగా ఎవరూ అమెరికాకు వెళ్లడం లేదు. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ చేయించుకుంటున్నాయి. అందువల్ల నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ట్రంప్ నిర్ణయం కారణంగా భారతీయ ఐటీ నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్1బీతోపాటు విదేశీ వర్క్ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా నిర్ణయంతో కొత్తగా 5.25 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వైట్ హౌస్ తెలిపింది.

ట్రంప్ నిర్ణయంతో ఇక నుంచి జీతాన్ని ప్రాతిపదికన తీసుకొని అత్యధిక జీతం ఉన్న 85వేల మందికి మాత్రమే వీసాలిస్తారు. అదీ అత్యంత నిపుణులకే ఇస్తారు. వారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతారనుకుంటేనే ఇస్తారు. సాధారణ, ఐటీ, ఉద్యోగులకు ఇవ్వరు. తద్వారా ఆయా రంగాల్లో అమెరికన్లు చేరి వారు స్థిరపడుతారు. అత్యంత నైపుణ్య స్థాయి ఉద్యోగాల్లో అమెరికన్ల పోటీ తక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ నైపుణ్యం గల విదేశీయులే అమెరికాకు వస్తారు. లక్షల ఉద్యోగాలు అమెరికన్లకు వస్తాయి. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలో నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలున్నాయి. కరోనా, ఆర్థిక మాంద్యంతో ట్రంప్ గెలవడం కష్టమైంది. అందుకే పెరిగిన నిరుద్యోగం అరికట్టడానికి ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన 4 కోట్ల మందికి వాటిని ఇవ్వడానికి ట్రంప్ వలసలను నిషేధించారని అంటున్నారు.

తాజా ఉత్తర్వులతో టెక్‌ కంపెనీలు విదేశీ వర్కర్లను పనిలోకి తీసుకోలేవు. ఆ పని చేసే సామర్థ్యం అమెరికన్లకు లేకపోవడం, వారు ఆ ఉద్యోగాల్లోకి రావడానికి ఇష్టపడకపోవడం కూడా కంపెనీ యజమానుల్లో ఆందోళన పెంచుతోంది.అమెరికాలో వృత్తి నిపుణులకు భారీగా వేతనాలు చెల్లించాలి. విదేశీయులైతే తక్కువ వేతనాలకు వస్తారన్న కారణంగా ఎన్నో బహుళ జాతీయ కంపెనీలు అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను ఉద్యోగాల్లో నియమిస్తున్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్‌ , అమెజాన్, ఫేస్‌బుక్‌ వంటి ఐటీ దిగ్గజాలకు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఎదురు దెబ్బ తగలనుంది. ఈ వీసాలపై నిషేధం పొడిగించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయులు మేకిన్ ఇండియాలో భారత్ లో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. వేరే దేశానికి పోవచ్చు. మొత్తంగా టాలెంట్ ఉన్న వారికి ఎక్కడైనా అవకాశాలు తెరిచే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.