Begin typing your search above and press return to search.

ఈనాడు జోస్యం నిజం కావట్లేదే

By:  Tupaki Desk   |   7 Dec 2015 5:30 PM GMT
ఈనాడు జోస్యం నిజం కావట్లేదే
X
తెలుగువారందరికి సుపరిచితమైన మూడు అక్షరాలు ‘ఈనాడు’. ఈ పత్రికను తెలుగు వారు తమదిగా భావిస్తారు. మరి.. ముఖ్యంగా 80ల నుంచి 2000 లోపు మధ్యన గ్రాడ్యుషన్ పూర్తి చేసిన వారైతే.. ఈనాడుతో వారి అనుబంధం అంతాఇంతా కాదు. వారి జీవితంలో ఈనాడు ఎక్కడో ఒక మూల ఏదో రూపంలో ఎంతోకొంత ప్రభావం చూపించి ఉంటుందనటంతో ఎలాంటి సందేహం ఉండదు.

మీడియా సంస్థలు చాలానే ఉన్నా.. ఈనాడు ప్రత్యేకత ఏమిటంటే.. అందులో ఏదైనా సమాచారం వస్తే.. దాని విశ్వసనీయతకు తిరుగు ఉండదన్న పేరుంది. అందుకు పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. ఇంటర్నెట్ వ్యాప్తి చెందక ముందే.. పరీక్షా ఫలితాలు వస్తే.. రిజల్ట్ ఎన్ని పేపర్లలో ఉన్నా.. ఈనాడు పేపర్లో ప్రచురించే ఫలితాల్లో కానీ నెంబరు ఉంటే పాస్ అయిపోయినట్లేనని చాలామంది భావించేవారు. ఎగ్జామ్ రిజల్ట్ కు సంబంధించిన నెంబరు విషయంలోనే ఇంత నమ్మకం ఉంటే.. వార్తల విషయంలో మరెంత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈనాడు ఆరంభంలో రాజకీయ జోస్యం అన్నది చెబితే.. అతికినట్లు సరిపోయేది. చాలా సందర్భాల్లో క్యాబినెట్ లో ఎవరికి మంత్రులుగా అవకాశం లభిస్తుందన్న విషయాన్ని పేపర్లో అచ్చేసిన ఆర్డర్ లోనూ మంత్రుల్ని పిలిచి ప్రమాణస్వీకారం చేసినట్లుగా చెబుతారు. అంత పక్కా సమాచారం ఈనాడు ఇస్తుందన్నది తెలుగోళ్ల నమ్మకం.

ఇప్పుడు ఆ నమ్మకానికి ప్రమాదం లేకున్నా.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న అనుమానం తాజా పరిణామాలు చూస్తే కలగక మానదు. కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి దానం నాగేందర్ విషయంలో ఈనాడు ఇప్పటికి రెండు..మూడుసార్లు వార్తలు రాసేసింది. ఇంకేముంది.. దానం నాగేందర్ టీఆర్ ఎస్ లోకి వెళ్లిపోతున్నారని. కానీ.. అదేం చిత్రమో.. దానం మాత్రం టీఆర్ ఎస్ లోకి వెళ్లటం లేదు సరికదా.. తాను వెళ్లేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. దానం నాగేందర్ విషయంలో ఈనాడు జోస్యం ఎందుకు నిజం కావట్లేదు? సమాచారం విషయంలో ఏదైనా లోపమా? లేక.. మరింకేదైనా ప్రాబ్లమా? ఏమైనా దానం వ్యవహారంలో ఈనాడు జోస్యం ఒకటికి రెండుసార్లు తప్పు కావటం విశేషంగానే చెప్పాలి.