Begin typing your search above and press return to search.

బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ

By:  Tupaki Desk   |   2 Jun 2021 2:10 PM IST
బెంగాల్ హింసపై సుప్రీంకు విద్యావేత్తల లేఖ
X
ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో హింస చెలరేగి ఎంత మంది ప్రాణాలు పోయాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ అంశం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మెడకు చుట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైనా.. బీజేపీకి ఓటు వేసిన వారిపై టీఎంసీ మూకలను మమతా బెనర్జీ ఉసిగొల్పారని పలువురు విద్యావేత్తలు తాజాగా సుప్రీంకోర్టుకు 00లేఖ రాయడం సంచలనమైంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో బెంగాల్ హింసపై విచారణ జరిపించాలని వారు తమ లేఖలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. 600మంది విద్యావేత్తలు ఈ లేఖలో సంతకాలు చేశారు.

తాజాగా బెంగాల్ లోని పలు యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లు, ప్రొఫెసర్లు 600మంది ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఎన్నికల అనంతరం బెంగాల్ వ్యాప్తంగా జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తో దర్యాప్తు జరిపించాలని.. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని వారు తమ లేఖలో కోరారు.

తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి.. ఆ పార్టీకి కాకుండా వేరే పార్టీలకు ఓటువేసిన వారి ప్రాణాలకు ప్రస్తుతం బెంగాల్ లో రక్షణ లేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎంసీ నేతలకు భయపడి వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తోందని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

ఇక జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలోనూ బెంగాల్ హింసపై దర్యాప్తు చేయాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్వతంత్ర్య వ్యవస్థల ద్వారా దర్యాప్తు జరిగితే బెంగాల్ లో ప్రస్తుత పరిస్థితులు వెలుగులోకి వస్తాయని వారంటున్నారు.

ఇటీవలే గత ఐదేళ్లుగా బెంగాల్ లో 166మంది బీజేపీ కార్యకర్తలను టీఎంసీ నేతలు హత్య చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత హింసలో 37మంది బీజేపీ నేతలు, కార్యకర్తలను చంపేశారని ఆయన అంటున్నారు.

ఈ ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. అయితే విద్యావేత్తల లేఖపై సుప్రీంకోర్టు ఏలా స్పందిస్తుందనేది? ఆసక్తిగా మారింది. మమతా బెనర్జీకి చిక్కులు తప్పవన్న చర్చ సాగుతోంది.