Begin typing your search above and press return to search.

బాబు జమానాలో ఒక్క శాఖ ఖ‌ర్చు లెక్క వింటే షాక్!

By:  Tupaki Desk   |   3 Jun 2019 4:31 AM GMT
బాబు జమానాలో ఒక్క శాఖ ఖ‌ర్చు లెక్క వింటే షాక్!
X
బాబు ఐదేళ్ల పాల‌న ఎలా సాగింది? కోట్లాది రూపాయిల్ని ప‌ప్పు బెల్లాల మాదిరి ఖ‌ర్చు చేసిన ఉదంతం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అన్ని శాఖ‌ల్ని ప‌క్క‌న పెట్టేసి.. కేవ‌లం ఒక్క శాఖ‌.. అది కూడా ఉన్న‌త విద్యామండ‌లికి సంబంధించిన ఖ‌ర్చు లెక్క ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోట్లాది రూపాయిల్ని ఎంత సింఫుల్ గా ఖ‌ర్చు చేశార‌న్న విష‌యం వెల్ల‌డైంది. ప‌ని కంటే ప్రచారానికి పెద్ద‌పీట వేసిన తీరు చూస్తే.. అన్ని శాఖ‌ల్లో ఇలాంటి దోపిడీ ఎంత భారీగా జ‌రిగింద‌న్న ఆలోచ‌న‌తో పాటు.. ప్ర‌జా ధ‌నాన్ని ఇంత దారుణంగా వృధా చేశార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

ఉన్న‌త విద్యా మండ‌లిలో చేసిన అన‌వ‌స‌ర ఖ‌ర్చు ఎంతంటే..

+ న‌లుగురు ఉన్న‌తాధికారులు మూడేళ్ల వ్య‌వ‌ధిలో తాము తినే డ్రైఫ్రూట్స్ కోసం చేసిన ఖ‌ర్చు అక్ష‌రాల రూ.18ల‌క్ష‌లు. అంటే.. ఏడాదికి ఒక్కో అధికారి ఖ‌ర్చు రూ.2ల‌క్ష‌లు అన్న మాట‌. వామ్మో.. ఎన్ని తిన్నారు బాబు?

+ ఏపీ వ్యాప్తంగా వివిధ ప్ర‌భుత్వ కాలేజీల్లో చ‌దివే ల‌క్ష మంది విద్యార్థుల‌కు ఇంగ్లిషులో స్కిల్స్ పెంచేందుకు.. నైపుణ్యాల్ని మెరుగుప‌ర్చేందుకు చేసుకున్న ఒప్పందం విలువ ఎంతో తెలుసా? రూ.13కోట్లు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే రూ.9 కోట్లు చెల్లించేశారు కూడా. స‌రే.. ఖ‌ర్చు చేశార‌నుకుందాం. ఇప్ప‌టివ‌ర‌కూ శిక్షణ తీసుకున్న వారెంత మందో తెలుసా? 13 వేల మంది విద్యార్థులు.. 2 వేల మంది టీచ‌ర్లు మాత్ర‌మే. ఈ మాత్రానికే ఇప్ప‌టికే రూ.9 కోట్లు ఖ‌ర్చు చేసేశారు.

+ ఈ ఖ‌ర్చు మీద విమ‌ర్శ‌లు రావ‌టంతో..ఒక క‌మిటీని వేశారు. అదో నివేదిక ఇచ్చింది. దాని ప్ర‌కారం ప్ర‌భుత్వ సంస్థ అయిన ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ వ‌ర్సిటీ షార్ట్ గా చెప్పాలంటే ఇఫ్లూతో శిక్షణ ఇప్పిస్తే మ‌రింత త‌క్కువ ఖ‌ర్చు అవుతుంద‌ని తేల్చారు. మ‌రీ.. విష‌యం ఉన్న‌త విద్యామండ‌లి అధికారుల‌కు ఎందుకు రాన‌ట్లు..?

+ ఎన్నిక‌ల వేళ అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ర్షించేందుకు వివిధ కార్య‌క్ర‌మాల్ని నిర్వహించిన బాబు స‌ర్కార్.. ప్ర‌తి వ‌ర్సిటీలో జ్ఞానభేరి పేరుతో ప్ర‌చారాన్ని నిర్వ‌హించారు. ప్ర‌తి వ‌ర్సిటీ ప‌రిధిలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం కోసం చేసిన ఖ‌ర్చు రూ.10 కోట్లు. ఆ స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌సంగంతో కూడిన బుక్ లెట్ ఒక్కొక్క దాని కోసం ఏకంగా రూ.వెయ్యి చొప్పున ఖ‌ర్చు చేశార‌ట‌.

+ ఒక్కో వ‌ర్సిటీలో ఎల్ ఈడీ బ‌ల్బుల‌ను ఏర్పాటు చేయాల‌ని భావించారు. ఇందులో భాగంగా రెండు వ‌ర్సిటీల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఏర్పాటు చేసి.. త‌ర్వాత మిగిలిన వ‌ర్సిటీల్లో చేప‌ట్టాల‌ని భావించారు.ఒక్కో వ‌ర్సిటీలో ఎల్ ఈడీ బ‌ల్బుల ఏర్పాటుకు రూ. 4 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని తేల్చారు. రెండు వ‌ర్సిటీల్లో ఏర్పాటు చేయాల‌ని ఉన్న‌త విద్యా మండ‌లి చెబితే.. ఎలాంటి డిటైల్డ్ రిపోర్ట్ లేకుండా 16 వ‌ర్సిటీల్లో ప్రాజెక్టు అమ‌లుకు ఒప్పందం చేసుకోవ‌టం విశేషం. ఇందుకోసం రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.

+ వివిధ విదేశీ వ‌ర్సిటీల్లో ఒప్పందాల కోసం ఉన్న‌త విద్యా మండ‌లి అధికారులు చేసిన ఖ‌ర్చు రూ.5కోట్లు. ఇంత ఖ‌ర్చుకు వ‌చ్చిన ఫ‌లితం పెద్ద‌గా లేదంటున్నారు. ఒక్క ఒప్పందం వ‌ల్ల కూడా లాభం జ‌ర‌గ‌లేద‌ని.. ఎనిమిది దేశాల్లో అధికారులు తిరిగి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

+ వ‌ర్సిటీలు నేష‌న‌ల్ ర్యాంకుల సాధ‌న కోసం స‌ల‌హాలు ఇచ్చేందుకు ఒక సంస్థ‌తో చేసుకున్న ఒప్పందం విలువ రూ.1.5కోట్లు. ఇంత‌కీ ఆ సంస్థ‌..నాటి మంత్రి గంటా అనుచ‌రుడిదిగా చెబుతున్నారు.

+ ఉన్న‌త విద్యామండ‌లిలో ఉన్న‌త‌స్థాయి అధికారుల వ్య‌క్తిగ‌త ఖ‌ర్చుల కింద మూడేళ్ల‌లో చేసిన ఖ‌ర్చు రూ.2కోట్లు. త‌మ కుటుంబాల‌ను చూడ‌టానికి సొంతూర్ల‌కు వారం.. వారం వెళ్లి రావ‌టానికి.. విమాన ప్ర‌యాణాల కోసం ఈ భారీ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌టం గ‌మ‌నార్హం.