Begin typing your search above and press return to search.

చానెళ్లపై దాడి అప్ర‌జాస్వామికం: ఎడిట‌ర్లు

By:  Tupaki Desk   |   1 May 2018 11:13 AM GMT
చానెళ్లపై దాడి అప్ర‌జాస్వామికం: ఎడిట‌ర్లు
X
గ‌త 6 నెల‌లుగా త‌న‌ను టార్గెట్ చేసిన కొన్ని తెలుగు మీడియా చానెళ్ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ వార్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఆ చానెళ్ల‌కు సంబంధించిన రేటింగులు ప‌డిపోయాయ‌ని వార్త‌లు కూడా వెలువ‌డ్డాయి. మ‌రోవైపు, మీడియాను బ్యాన్ చేయాల‌ని... లేదంటే త‌మకు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో మీడియాకు ప‌రిమితులు విధించాల‌ని ...టాలీవుడ్ లోని ప్ర‌ముఖ హీరోలు చూచాయ‌గా అనుకున్నార‌ని పుకార్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్ లో టీవీ చానళ్ల ఎడిటర్లు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారు. తెలుగు న్యూస్ ఛానల్స్ ను కొంద‌రు లక్ష్యంగా చేసుకోవ‌డాన్ని వారు తీవ్రంగా ప‌రిగ‌ణించారు. కొన్ని చానెళ్లను నిషేధించాల‌ని కొంద‌రు పిలుపునిస్తుండటాన్ని ఖండించారు. మీడియాపై కొంద‌రు సినీ ప్ర‌ముఖులు చేస్తోన్న దాడిని ఆపాల‌ని వారు డిమాండ్ చేశారు. టీవీ9, టీవీ5, మహాన్యూస్, సాక్షి, ఎన్టీవీ, ఏబీఎన్ తదితర చానళ్ల ప్రతినిధులు ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు.

టీవీ చానెళ్ల‌ను బ్యాన్ చేయాల‌ని పిలుపునివ్వ‌డం అప్ర‌జాస్వామిక చ‌ర్య అని వారు అన్నారు. చ‌ట్ట‌ప‌రిధిలోనే నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు లోబ‌డి టీవీ చానెళ్లు ప‌నిచేస్తున్నాయ‌ని అన్నారు. కొంద‌రు సినిమావారు మీడియాకు కులం రంగు పూసి...వాటిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయ‌డం వారి అజ్ఞానాన్ని, అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తోంద‌ని మండిపడ్డారు. టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ పై ప్రశ్నిస్తూ, చర్చలు పెట్ట‌డం త‌ప్పు కాద‌ని, వాటికి ప‌రిష్కారం చూప‌కుండా పక్కదారి పట్టించేందుకు మీడియాపై కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. మహిళా నటుల సమస్యలకు, ఆరోపణలకు పరిష్కారం చూపాల‌ని వారు డిమాండ్ చేశారు. వీరంతా సినిమా వారా? లేక కుల సంఘాల ప్రతినిధులా? అన్నది స్పష్టం చేయాలని ఎడిట‌ర్లు డిమాండ్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు చానెళ్ల‌ను నియంత్రించాలని భావిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ప్ర‌కారం ఓ తీర్మానాన్ని తెలుగు టీవీ వార్తా చానళ్లు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

అయితే, మీడియా చానెళ్ల ఎడిట‌ర్లు నిన్న స‌మావేశం ఏర్పాటు చేయ‌డంపై భిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. మీడియా స్వేచ్ఛ‌ను ఎవ‌రూ అడ్డుకోకూడ‌ద‌ని, అలా చేయ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అదే స‌మ‌యంలో కేవ‌లం తమ టీఆర్పీల‌ను పెంచుకునేందుకు అన‌వ‌స‌ర‌మైన చ‌ర్చ‌లు ప్ర‌సారం చేయకుండా ఉండాల‌ని పలువురు కోరుకుంటున్నారు. అయితే, మీడియా మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎంత లేద‌న్నా...ఆ మీడియా చానెళ్ల‌తోపాటు అన్ని చానెళ్ల‌పై ప‌వ‌న్ ఎఫెక్ట్ కొద్దో గొప్పో ప‌డింది. అందుకే కొంత‌కాలంగా అన‌వ‌స‌ర చ‌ర్చ‌లు, లైవ్ డిబేట్లు జ‌ర‌గ‌డం లేదు. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా మీడియా చానెళ్ల‌పై గుర్రుగా ఉండ‌డం....యాడ్స్, లైవ్ ఈవెంట్ల రూపంలో వ‌చ్చే రెవెన్యూ కోల్పోవ‌డం...వంటి ప‌రిణామాల‌ను అధిగ‌మించ‌డం కోసం సినీ పెద్ద‌ల‌తో మీడియా పెద్ద‌లు రాజీకి వ‌చ్చార‌ని టాక్ ఉంది. ఇప్ప‌టివర‌కు ప‌వ‌న్ త‌ర‌హాలో ప్ర‌తిస్పంద‌న ఎదురుకాక‌పోవ‌డంతో...మీడియా కూడా మోనార్కిజాన్ని ప్ర‌ద‌ర్శించింద‌న్న‌ది అంగీక‌రించాల్సిన వాస్త‌వం.

ఈ నేప‌థ్యంలోనే....మ‌రీ బెండ్ అయ్యామ‌ని కాకుండా....త‌మ‌ను బ్యాన్ చేయ‌డం అప్రజాస్వామిక‌మ‌ని ప్రెస్ మీట్ పెట్టాయి. ప‌వన్ ఎఫెక్ట్ లేకుంటే....ఇదే ప్రెస్ మీట్ ...లైవ్ డిబేట్...గా మారి..దానిపై కొంద‌రు సోకాల్డ్ పెద్ద‌ల‌ను చర్చ‌ల‌కు పిలిచి ఓ 3-4 రోజులు పండ‌గ చేసుకునేవారు. మ‌రోప‌క్క సోష‌ల్ మీడియాలో కూడా ...మీడియా విలువ‌లు దిగ‌జారిపోయాయంటూ...అందులోనూ తెలుగు మీడియా మ‌రి కులాల‌కు గొడుగుప‌డుతోందంటూ విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. దీంతో, దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టిన మీడియా చానెళ్లు...కొద్దిగా దూకుడును త‌గ్గించాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. మ‌రి ...మీడియా చానెళ్ల ఆవేద‌న‌ను ఇండ‌స్ట్రీలోని బ‌డా హీరోల మ‌లి స‌మావేశంలో చ‌ర్చించి ఏం నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌న్న‌ది ఆస‌క్తికరంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.