Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ బంటుదీ అమ్మ పాల‌నేన‌ట‌!

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:39 AM GMT
చిన్న‌మ్మ బంటుదీ అమ్మ పాల‌నేన‌ట‌!
X
అదేదో తెలుగు సినామాలో ఓ పోలీసు ఉన్న‌తాధికారి అన్న మాట ఇప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌ల మదిలో నుంచి చెరిగిపోలేదు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఠాగూర్ చిత్రంలో హీరోను ప‌ట్టేసేందుకు ఎంట్రీ ఇచ్చిన పోలీసు ఆఫీసర్‌... మీ తెలుగు ప్ర‌జ‌లంతా సెంటిమెంట‌ల్ ఫూల్స్ అంటూ కామెంట్ చేస్తాడు. ఈ మాట నిజంగానే ఆ సినిమాలో హైలెట్‌గానే నిలిచింద‌ని చెప్పాలి. తెలుగు ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్సో, కాదో చెప్ప‌లేం గానీ...త‌మిళ తంబీలు మాత్రం నిజంగానే సెంటిమెంట‌ల్ ఫూల్స్‌గానే చెప్పుకోవాలి. న‌మ్మిన నేత‌ను త‌మిళ తంబీలు ఆరాధించే విష‌యంలో తెలుగు ప్ర‌జ‌లైనా... ఇంకెవ‌రైనా ఆ త‌ర్వాతే.

అయినా ఇప్పుడిదంతా ఎందుకంటే... తమిళ‌నాడు ప్ర‌జ‌ల మ‌దిలో దివంగత ఎంజీఆర్‌కు చిర‌స్థానం ఉంది. అదే స్థాయిలో ఇటీవ‌లే మ‌ర‌ణించిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత‌కు కూడా త‌మిళ ప్ర‌జ‌ల మ‌న‌సులో స్థానం ద‌క్కింద‌నే చెప్పాలి. 71 రోజుల పాటు ఆసుప‌త్రిలో జ‌య ఉంటే... ఏ ఒక్క రోజు కూడా ఆ ఆసుప‌త్రి వ‌ద్ద జ‌నం త‌గ్గింది లేదు. తామంతా అమ్మ‌గా పిలుచుకునే జ‌య పూర్తి ఆయురారోగ్యంతో తిరిగి రావాల‌ని కోరుకోని త‌మిళుడు ఉండ‌డంటే అతిశ‌యోక్తి కాదేమో. అయితే వారి ఆశ‌ల‌న్నీ అడియాశ‌స‌లు అయిపోగా... జ‌య శ‌వ‌మై ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అక్క‌డ రాజ‌కీయంగా అస్థిర‌తే నెల‌కొంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

అమ్మ మ‌ర‌ణించ‌గానే... ఆమె న‌మ్మిన బంటుగా ఉన్న ఓ ప‌న్నీర్ సెల్వం సీఎంగా కాగా... అమ్మ నెచ్చెలి శ‌శిక‌ళ చ‌క్రం తిప్పి త‌న‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామిని సీఎం పీఠ‌మెక్కించి, ప‌న్నీర్‌ను ఏకంగా కేబినెట్ నుంచే త‌ప్పించేశారు. ఇది జ‌రిగి చాలా కాల‌మే అయినా... ఇంకా అక్క‌డి ప్ర‌జ‌లు అమ్మ‌ను మ‌రిచిపోలేక‌పోతున్నారు. ఈ భావ‌న‌ను గ‌మ‌నించిన ఈపీఎస్ స‌హా ఇత‌ర కేబినెట్ మంత్రులు, శ‌శిక‌ళ‌, ఆమె మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్ నిత్యం అమ్మ మాట‌ను ప‌లుకుతూనే త‌మకు అనుకూలంగా పావులు క‌దుపుకుంటున్నారు. ఎవ‌రు ఎన్ని పాచిక‌లు ర‌చించినా... అమ్మ మాట విన‌బ‌డితే త‌మ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాద‌ని వారంతా ఎప్పుడో తెలుసుకున్నారు.

అందుకేనేమో... నేటి ఉద‌యం భార‌త 71వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఆ రాష్ట్ర సీఎం నోట అమ్మ మాట మ‌రోమారు విన‌ప‌డింది. తమిళనాడు సచివాలయ ప్రాంగణం సెయింట్‌ జార్జి కోట బురుజులపై రాష్ట్ర సీఎం హోదాలో పళనిస్వామి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.