Begin typing your search above and press return to search.

విచారణ హాజరుకావాలని నామాకు ఈడీ సమన్లు

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
విచారణ హాజరుకావాలని నామాకు ఈడీ సమన్లు
X
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. టీఆర్ఎస్ ఎంపీకి షాకిచ్చింది.. టీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.

బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో ఇటీవల నామా నాగేశ్వరరావు, ఆయన కంపెనీ మధుకాన్ సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నామాతోపాటు మధుకాన్ కంపెనీ డైరెక్టర్లకు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది.

జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్టు మధుకాన్ గ్రూపుపై ఈడీ అభియోగం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన సోదాల్లో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వాటి ఆధారంగానే విచారణ చేపట్టేందుకు ఈడీ నిర్ణయించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే నామాకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఈడీ సోదాల్లో దస్త్రాలతో పాటు భారీగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఈ విచారణలో నామాతోపాటు మధుకాన్ డైరెక్టర్ల నుంచి.. ఆయన కంపెనీ అవకతవకలపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఈడీ పడింది. మరి నామాకు ఎలా చిక్కులు వస్తాయన్నది వేచిచూడాలి.