Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: మంత్రి గంగుల ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

By:  Tupaki Desk   |   9 Nov 2022 7:03 AM GMT
బ్రేకింగ్: మంత్రి గంగుల ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
X
మునుగోడు ఓటమితో రగిలిపోతున్న బీజేపీ ప్రతీకారం మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. బీజేపీ ఆ ఆనందం లేకుండా అప్పుడే కీలక టీఆర్ఎస్ నేతలపై గురిపెట్టింది. టీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా ఉంటున్న బడా వ్యాపారులైన మంత్రులపైనే ఐటీ, ఈడీ దాడులు మొదలుపెట్టింది. ఇప్పుడివీ తెలంగాణ రాజకీయాల్లో సంచలనమవుతున్నాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు కలకలం రేపుతున్నాయి. ఐటీ, ఈడీ అధికారులు తాజాగా హైదరాబాద్ తోపాటు కరీంనగర్ లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా కరీంనగర్ కు చెందిన టీఆర్ఎస్ మంత్రి, గంగుల కమలాకర్ తోపాటు గ్రానైట్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదరాబాద్ గూడలోని జనప్రియ అపార్ట్ మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు జరిగాయి.

కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటితోపాటు మంకమ్మతోటలోని ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్ తోపాటు మరికొంత మంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుమారు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

మునుగోడులో గెలిచిన ఆనందం లేకుండా.. తమను ఓడించిన టీఆర్ఎస్ పై బీజేపీ ఇలా ప్రతీకారం మొదలుపెట్టిందని టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.